కేసీఆర్‌కు ఇంకా అధికార మత్తు దిగలేదా?

తెలంగాణలో 10 ఏళ్లు పాలించి ఓడిపోయారు. అధికారం దూరమైందన్న బాధ ఓవైపు.. లీడర్లు దూరం అవుతున్నారనే ఫ్రస్టేషన్ మరోవైపు మొత్తం మీద మాజీ సీఎం కేసీఆర్ లో కనిపిస్తున్నాయి అంటున్నారు విశ్లేషకులు. ఓట్లేసి కాంగ్రెస్ ను గెలిపించిన తెలంగాణ ఓటర్లను తిట్టిపోస్తున్నారు.  ఈ అహంకారమే అధికారానికి దూరం చేసిందని మాత్రం మాజీ సీఎం కేసీఆర్ గ్రహించలేకపోతున్నారు.

ఎన్నికల్లో ఓటమి పాలైనా కేసీఆర్ వ్యవహార శైలిలో మార్పు రావడం లేదు.  ఎన్నికల్లో ఓటమి నెపాన్ని స్థానిక నాయకుల మీద వేసి చేతులు దులిపేసుకుంటున్నారు.  తాజాగా ఎంపీ ఎన్నికలకు బీఆర్ఎస్ సమాయత్తమవుతుంది. కాకపోతే సిట్టింగులు, పార్టీ సీనియర్ నాయకులు ఎన్నికల్లో పార్టీ గుర్తుపై నిలబడమని తేల్చి చెబుతున్నారు. మరికొంతమంది పార్టీ మారి తమ దారి చూసుకుంటున్నారు. తాజాగా కరీంనగర్ లో కేసీఆర్ మాట్లాడిన తీరు చూస్తుంటే ఆయన వ్యవహార శైలిలో ఏ మార్పు రాలేదని.. గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఎలాగైతే అధికార గర్వంతో మాట్లాడారో ఇప్పుడు కూడా అలానే వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఈ సభలో కాంగ్రెస్ వరాలకు అత్యాశపడి.. మోసపోయి ఓట్లేశారని జనంపై మండిపడ్డారు గులాబీ బాస్. నాకు బ్రేకులు వేయకుంటే.. సగం దేశానికి అగ్గి పెట్టేవాడినని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు మేడిగడ్డపై కూడా బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. ఏవో ఇసుక జారి రెండు పిల్లర్లు కుంగితే ప్రళయం వస్తుందా.. దేశం కొట్టుకుపోతుందా అంటూ ఊగిపోయారు.

మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిపై కూడా పలు ఆరోపణలు గుప్పించారు. సీఎం మాట్లాడాల్సిన భాషేనా ఇది అంటూ తప్పుపట్టారు. ఇంత వరకు బాగానే ఉన్నా తాను సీఎంగా ఉన్న పదేళ్ల కాలంలో ఇలాంటి భాష వాడలేదని చెప్పడమే ఆ పార్టీ కార్యకర్తలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. మొత్తం మీద కేసీఆర్ మాట్లాడే మాటలు.. వ్యవహరించే తీరుపై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ విపరీతంగా పేలుతున్నాయి.  మరోవైపు కాళేశ్వరం ఆయన మానస పుత్రికగా పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు అని దీనికి బాధ్యత కూడా కేసీఆరే వహించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: