చాణక్యుడినని మళ్లీ నిరూపించుకున్న బాబు?
ఇదిలా ఉండగా.. చంద్రబాబు తన చాణక్యాన్ని ప్రదర్శించి బీజేపీతో పొత్తు ఓకే చేయించగలిగారు. ఈ సందర్భంగా కిక్ సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ గుర్తుకు వస్తోంది. ఎవరికి వారు గేమ్ స్టార్ చేశారని అనుకుంటున్నారు అమ్మా. కానీ వాడు ఆడే గేమ్ లో మనం అందరూ ప్లేయర్స్ అమ్మా అని ఇలియానాతో రవితేజ గురించి బ్రహ్మానందం చెబుతారు. సేమ్ టూ సేమ్ ఇలానే ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు తన గేమ్స్ ని ప్లే చేస్తున్నారు.
తెలుగు దేశానికి సంబంధించిన పార్టీ సీనియర్ నేతలు, నలుగురు రాజ్యసభ ఎంపీలను చంద్రబాబు ముందుగానే బీజేపీలోకి పంపగలిగారు. ఆయన అనుకున్నట్లు గానే వారు బీజేపీ అధిష్ఠానాన్ని ఇన్ఫ్లూయెన్స్ చేయగలిగారు. ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే పొత్తుల విషయంలో చంద్రబాబు ఒక్క మెట్టు కూడా దిగలేదు. మిగతా ప్రతిపక్షాలను తన దారిలోకి తెచ్చుకున్నారు. ఆది నుంచి టీడీపీ పెట్టుకున్న లక్ష్యం మిత్రపక్షాలకు 30 సీట్లు కేటాయించాలని. తాము 145 స్థానాల్లో పోటీ చేసి ఒంటరిగా అధికారంలోకి రావాలన్నది ఆ పార్టీ అధినేత వ్యూహం.
బీజేపీ దేశ వ్యాప్తంగా ఆయా రాజకీయ పార్టీల నేతలను తమ చెప్పు చేతల్లోకి తెచ్చుకొని పొత్తులు పెట్టుకుంది. జేడీఎస్, నితీశ్ కుమార్ లాంటి నేతలను సైతం తమ దారిలోకి తెచ్చుకుంది. కానీ ఏపీలో మాత్రం చంద్రబాబు ఆ అవకాశం ఇవ్వలేదు. ఆరు అసెంబ్లీ స్థానాలకు ఆ పార్టీని పరిమితం చేశారు. మరోవైపు బీజేపీ పోటీ చేసే ఎంపీ స్థానాలతో సహా టీడీపీ అధినేత చెప్పిన వారికే సీట్లు ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. తద్వారా బీజేపీ, జనసేనను తన గుప్పిట్లోకి తెచ్చుకోగలిగారు. ఎవర్ని అయినా తన దారిలోకి చంద్రబాబు తెచ్చుకుంటారు అని మరోసారి నిరూపితం అయింది.