ఆ వర్గాన్ని మెప్పిస్తేనే జగన్ మళ్లీ సీఎం?

చంద్రబాబుని మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా నమ్ముతారు. పేదలు వైఎస్ జగన్ వెంట ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే దాదాపు 80శాతం మంది పేద ప్రజలు జగన్ నే నమ్ముతున్నారు.  గత పాలకులతో పోల్చినప్పుడు ప్రస్తుతం జగన్ వీరికి ఆశాజనకంగా ఉన్నారు. మధ్య తరగతి ప్రజల విషయానికొస్తే చంద్రబాబే మేలు అని 60శాతం మంది ప్రజలు అనుకుంటున్నారు. వైసీపీ పాలన ప్రారంభంలో వారు కూడా జగన్ ని అభిమానించినా.. పెరుగుతున్న ఖర్చులు.. విపరీతమైన నిత్యావసర ధరల కారణంగా వారంతా క్రమంగా జగన్ కు దూరం అవుతూ వచ్చారు.

మరోవైపు సంక్షేమ పథకాలకు మధ్య తరగతి ప్రజలు కొంతమేర వ్యతిరేకంగా ఉంటారు. ఎందుకంటే ఆ భారం తమపైనే పడుతుందని వారు అంచనా వేస్తారు. ఆలోచిస్తారు. వారికి మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధి కల్పన అవకాశాలు కావాలి. మరోవైపు జగన్ బటన్ నొక్కి నేరుగా పేదలకు ఆర్థిక సాయాలు చేస్తున్నారు. దీంతో కొంతమంది కూలీ పనులు చేసేందుకు డిమాండ్ చేస్తున్నారు. అధిక మొత్తంలో వసూలు చేస్తూ ఇష్టమైతే చెప్పమని లేకపోతే వద్దని తెగేసి చెబుతున్నారు. ఆ ఇంటికి వచ్చే కూలీలను మధ్య తరగతి ప్రజలు ఏం అనలేరు. దీనికి కారణం అయిన జగన్ ని నిందిస్తారు. తద్వారా చంద్రబాబునే కోరుకుంటున్నారు.

మరి జగన్ కి ఈ వర్గం ఓట్లు వద్దా అంటే తప్పకుండా కావాలి. గెలుపోటములను డిసైడ్ చేసే వారిలో మధ్య తరగతి వారు కచ్చితంగా ఉంటారు. మరి వీరిని ప్రసన్నం చేసుకునేందుకు జగన్ ఎలాంటి వ్యూహాలు రచిస్తారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. పేదలకు కుటుంబానికి ఏడాదికి సుమారు రూ.50 వేలు ఆర్థిక సాయం అంటే ఆషామాషీ విషయం ఏమీ కాదు. ఐదేళ్లలో రూ.2.5లక్షల మేర సాయాన్ని ప్రకటించారు. పేదలకు ఎంత చేసినా.. ఇంకాస్త ఇస్తే బాగుండు అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ మధ్య తరగతి వారికి ఏం చేస్తారు అనేది ఇప్పుడు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: