కాంగ్రెస్‌ VS బీజేపీ.. బీఆర్‌ఎస్‌ గల్లంతు?

గత ఏడాది లోక్ సభ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అప్పుడు ఇచ్చిన నినాదం సారు.. కారు.. పదహారు… అంతకు ముందు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో తెలంగాణలో 17 సీట్లకు 16 సీట్లు గెలిచేందుకు ఈ నినాద ఇచ్చింది. ఎన్నికల ఓటమితో కాంగ్రెస్ డీలా పడింది. బీజేపీ ఒకటి కూడా కష్టమే అనే మాటలు వినిపించాయి. తీరా చూస్తే బీఆర్ఎస్ తొమ్మిది సీట్లకు పరిమితం అయింది. బీజేపీ నాలుగు, కాంగ్రెస్ మూడు సీట్లను గెలుచుకున్నాయి.

ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బీఆర్ఎస్ తెలంగాణలో ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీలోకి వలసలు ఉంటాయని భావిస్తే అనూహ్యంగా బీజేపీలో చేరికలు పెరిగాయి. తెలంగాణ ఎంపీల్లో ఆ చివరన ఉన్న జహీరాబాద్.. ఈ చివరన ఉన్ననాగర్ కర్నూల్ ఎంపీలు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. బీబీ పాటిల్, రాములు కుమారుడికి బీజేపీ తొలి జాబితాలోనే చోటు దక్కింది.

తెలంగాణలో క్రమానుగతంగా బలోపేతం కావడంపై దృష్టి సారించిన బీజేపీ ఓ వైపు ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహిస్తూనే.. మరోవైపు సంస్థాగతంగా బలోపేతం కావడంపై దృష్టి సారించింది. దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణపై ప్రధాని మోదీ.. కేంద్ర మంత్రి అమిత్ షా ప్రత్యేక దృష్టి సారించారు.

తెలంగాణ లో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న జిల్లాలో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ గెలిచారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ జిల్లాలో కాంగ్రెస్ కే ఎక్కువ సీట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ ఎంపీ బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ జిల్లాతో పాటు రిజర్వ్డు అయిన ఎంపీ కూడా కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. దీంతో లోక్ సభ ఎన్నికల ముందు చేరికలతో బీజేపీలో నూతనోత్సాహం కనిపిస్తోంది. ఈసారి ప్రధాన పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్యే అని ప్రచారం చేస్తోంది. ఏది ఏమైనా ఈసారి లోక్ సభ ఎన్నికల్లో హాట్ ఫేవరెట్ గా బీజేపీ నిలవనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: