ఆ ముగ్గురి సీట్లపై జగన్‌ "వ్యూహం" ఫలిస్తుందా?

కుప్పం, మంగళగిరితో సహా 175 కి 175 స్థానాలను కైవసం చేసుకోవాలని వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ సారి ఎలాగైనా చంద్రబాబుని కుప్పంలో ఓడించాలని జగన్ కంకణం కట్టుకున్నారు. ఈ బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. ఇప్పటికే కుప్పంలో రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు సీఎం జగన్.

ఎమ్మెల్సీగా ఉన్న భరత్ ను అభ్యర్థిగా ప్రకటించి.. గెలిపిస్తే క్యాబినెట్లో మంత్రి అవకాశం కల్పిస్తానంటూ ప్రకటించారు. ఆ ప్రకటనతో కుప్పం నియోజకవర్గ వైసీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. మరోవైపు నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలను సైతం వైసీపీ అవకాశంగా మలుచుకుంది. మరోవైపు నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంపై కూడా జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇక్కడి నియోజకవర్గ బాధ్యతను ఎంపీ విజయసాయిరెడ్డికి అప్పగించారు.

గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేశ్ ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. మరో సారి అలాంటి ఫలితాన్ని పునరావృతం చేసేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఆళ్ల ను తప్పించి తొలుత గంజి శ్రీనివాస్ కి అవకాశం కల్పించింది. చేనేతలు ఎక్కువగా ఉండటంతో ఆ సామాజిక వర్గానికి చెందిన గంజిని అభ్యర్థిగా ప్రకటించింది. అయితే కొద్ది రోజులకే ఆయన పనితీరు బాగాలేదని భావించిన అధిష్ఠానం ఆళ్ల రామకృష్ణారెడ్డిని వెనక్కి రప్పించి..ఆయన సూచన మేరకు కొత్త ఇన్ఛార్జిని ప్రకటించింది.  

ఇక్కడ  మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు కోడలు.. మాజీ ఎమ్మెల్యే కాండ్ర కమల కుమార్తె లావణ్యను మంగళగిరి అభ్యర్థిగా ప్రకటించారు. మరోవైపు పవన్ పోటీ చేసే స్థానాలపై కూడా ఆ పార్టీ కసరత్తులు ప్రారంభించింది. జనసేనాని పిఠాపురం నుంచి కానీ.. భీమవరం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. పవన్ ను ఓడించే బాధ్యతను ఎంపీ మిధున్ రెడ్డికి జగన్ అప్పగించారు. ఒకవేళ పిఠాపురం అయితే కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభాన్ని బరిలో నిలిపి తద్వారా పవన్ కు చెక్ పెట్టాలని వైసీపీ భావిస్తోంది. మొత్తం మీద జగన్ ఈ ముగ్గురిపై ప్రత్యేక దృష్టి సారించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: