కొత్త స్థానంలోకి రోజా.. ఇక ఢిల్లీని దున్నేస్తారా?

సిద్ధం అంటూ భీమిలి వేదికగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమర శంఖం పూరించారు. ఇదే సమయంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు కీలక స్థానాల్లో మార్పులు చేర్పులు చేసిన జగన్.. ఇక తుది జాబితాపై కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల్లో కొందరికీ మొండి చేయి చూపిస్తుంటే కొందరికీ స్థాన చలనం కలిగిస్తున్నారు.

తాజాగా ఇదే కోవలోకి మంత్రి రోజా చేరారు. ఈసారి రోజాకు అసెంబ్లీ టికెట్ నిరాకరించినట్లు వార్తలు వస్తున్నాయి. నగరి అసెంబ్లీ స్థానంలో  సొంత పార్టీ నేతల నుంచే రోజాకు వ్యతిరేకత ఎదురవుతోంది. ఒకవేళ టికెట్ ఇచ్చినా వచ్చే ఎన్నికల్లో సొంత పార్టీ నేతలే ఓడించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వైసీపీ అధిష్ఠానం వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆమెను అసెంబ్లీ బరిలోకాకుండా లోక్ సభ బరిలో దింపాలని యోచిస్తుందంట.

వైసీపీ ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన రోజాను ఒంగోలు పార్లమెంట్ స్థానానికి పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై రోజా అభ్యర్థిత్వానికి ఒంగోలుకు చెందిన నేతలు సైతం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ తో పాటు, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇతర నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు అంట. మరోవైపు ఈ ప్రతిపాదనను రోజాకు కూడా తెలియజేశారు. సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు సిద్ధమని రోజా ప్రకటించినట్లు సమాచారం.

అయితే ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కి టికెట్ ఇచ్చేందుకు వైసీపీ నిరాకరించింది. ఈ స్థానంలో పోటీ చేయించడానికి చెవిరెడ్డి భాస్కరరెడ్డి పేరుకూడా తెరపైకి వచ్చింది. ఇప్పటికే చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు పోటీ చేస్తున్న వేళ.. భాస్కర రెడ్డిని ఎంపీగా పంపాలని ప్రయత్నాలు జరిగాయి. అయితే ఈ విషయంపై జిల్లా నేతల నుంచి ముఖ్యంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నుంచి వ్యతిరేకత వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో రోజా పేరు తెరమీదకు వచ్చింది. నర్సారావు పేట నుంచి అనీల్ కుమార్ యాదవ్, ఒంగోలు నుంచి రోజా పోటీచేస్తారని ఖాయంగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: