నేరుగా జగన్‌తోనే ఢీకొంటున్న షర్మిళ?

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అనూహ్య  పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.  ఎందుకంటే ఇప్పుడు కొత్తగా షర్మిళ ఏపీ పాలిటిక్స్ లోకి  ఎంట్రీ ఇచ్చారు. రక్తం పంచుకుపుట్టిన అన్నా చెల్లెలు సీఎం జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిళ రాజకీయ ప్రత్యర్థులుగా మారారు.  ఇన్ని రోజులు మూడు పార్టీల రాజకీయం అయితే ఇప్పుడు షర్మిళ వల్ల కాంగ్రెస్ నాలుగో పార్టీగా ఏర్పడింది. అయితే ఆమె వల్ల హస్తం పార్టీకి  పూర్వ వైభవం వస్తుందా అనేదే అసలు ప్రశ్న.

మరోవైపు ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరిస్తూనే సోదరుడు జగన్ తో జగడం తప్పదనే బలమైన సంకేతాలు పంపారు. గట్టిగానే పోరాడుతానని స్పష్టం చేశారు. గత కొంతకాలంగా వైఎస్ కుటుంబంలో వివాదాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్లుగానే షర్మిళ వ్యవహారశైలి ఉంది. ఇటీవల షర్మిళ కుమారుడి నిశ్చితార్థానికి సీఎం జగన్ హాజరు కావడంతో అంతా సమసిపోతాయని అంతా భావించినా.. తాజా ప్రకటనలతో సంధి కాదు సమరమే అని ఆమె తేల్చేశారు.

అయితే రాజకీయాల్లో ఇవి సహజమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాహుల్ గాంధీ - వరుణ్ గాంధీ, స్టాలిన్ – అళగిరి, ఒకే పార్టీలో ఉన్న తేజస్వీ యాదవ్ ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్, ములాయం సింగ్ ఫ్యామిలీ ఇలా చాలామంది అంటీ ముట్టనట్లుగానే ఉన్నారు.  కాబట్టి ఒకే కుటుంబంలో రెండు వేర్వేరు పార్టీలకు చెందిన నాయకులు ఉండటం ఇదే కొత్తేమీ కాదు.  అలా అని చివరి సారి కాదు అని గుర్తు చేస్తున్నారు.

కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితులు ఎదురు కాలేదు కాబట్టి కొంత ఆసక్తికరంగానే ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం షర్మిళను సీఎం జగన్ చెల్లెలిగా కాకుండా ఏపీసీసీ అధ్యక్షురాలిగా చూడాలంటున్నారు. ఆమె ఓ పార్టీ నాయకురాలిగానే సోదరుడు జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు కూడా. కాకపోతే జగన్ వీటిని ఎలా తిప్పి కొడతారు.. ఆమెను ఏ విధంగా విమర్శిస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: