పవన్‌, లోకేష్‌.. ఇది సాధిస్తారా?

రాజకీయ నేతలు తమ పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తూ పలు చేరికలను ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా 2014లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్తిగా కనుమరుగవుతున్న నేపథ్యంలో ఆ పార్టీ నాయకులను తమ పార్టీలో చేర్చుకున్నారు. తద్వారా కొంతమేర లాభం పొందారు.  అదే సమయంలో కేసీఆర్ కూడ తెలంగాణ లో రాజకీయ పునరేకీకరణ పేరుతో ఇతర పార్టీ నేతలతో పాటు మెజార్టీ టీడీపీ నేతలను కారెక్కించారు. ఇవి ఆయా రాజకీయ పార్టీల వ్యూహాల్లో భాగం.


ఈ సమయంలో చంద్రబాబు ఇతర పార్టీ నేతలను తమ పార్టీలోకి చేర్చుకునే నేపథ్యంలో ఆయా నియోజకవర్గ నేతలతో వారిని కూర్చోబెట్టి వారి మధ్య సమన్వయం కుదిరేలా చేశారు. తద్వారా మంచి సమన్వయంతో పాటు పార్టీ బలోపేతం అయింది. ఇప్పుడు ఇదే పని పవన్ కల్యాణ్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తు ప్రకటించి రెండు పార్టీలు కలిసే ప్రజా క్షేత్రంలోకి వెళ్దామని నిర్ణయించుకున్నాయి. అందుకు తగిన భవిష్యత్తు కార్యచరణను సైతం రూపొందించాయి.


ఈ సమయంలో టీడీపీ, జనసేన నేతల మధ్య సమన్వయం కుదిరేలా ఆయా పార్టీల అధినేతలు దృష్టి సారించాలి. ఇప్పుడు చంద్రబాబు అరెస్టై జైలులో ఉన్నారు.  టీడీపీ నేతలకు, జనసేన నేతలకు మధ్య సయోధ్య కుదర్చే బాధ్యత పవన్ పై పడింది. పొత్తులో భాగంగా పలుచోట్ల టీడీపీ, జనసేన పార్టీలు పోటీ చేస్తాయి. ఇందులో ఆయా నేతలు సర్దుకు పోతారా అంటే చెప్పలేం. ఒకపార్టీకి చెందిన నేతలే టికెట్ రాకపోతే పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటుంటారు.


ఇదే సందర్భంలో పార్టీ నుంచి బయటకు వచ్చేస్తుంటారు. ఇటీవల జనసేనకు కేతంరెడ్డి, పసుపులేటి పద్మావతిలు  రాజీనామా చేశారు. వీరి వల్ల పార్టీ బలహీన పడుతుంది అని కాదు.  కానీ పార్టీ నేతలతో పవన్ మాట్లాడి వారి మధ్య సయోధ్య కుదిర్చి పార్టీకి వారి అవసరాన్ని తెలియజేయాలి. ఇలా చేస్తే పవన్ పై ప్రేమతో మాట వినే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: