వైసీపీ వార్‌: పురంధేశ్వరిని టార్గెట్‌ చేస్తున్నారా?

చంద్రబాబు అరెస్టు తర్వాత ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. వైసీపీ వర్సెస్ టీడీపీ నేతల మధ్య ఉన్న రాజకీయ విమర్శలు కాస్తా ఇప్పుడు బీజేపీ వైపు మళ్లాయి. సోము వీర్రాజు హయాంలో పెద్దగా విమర్శలు చేసుకోని బీజేపీ, వైసీపీ నేతలు తాజాగా బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి బాధ్యతలు చేపట్టగానే ఆమెను టార్గెట్ గా చేసుకున్నారు.


గతంలో వైసీపీ నేతలు దమ్ముంటే టీడీపీ, జనసేనలు సింగిల్ గానే పొత్తులేకుండా పోటీకి రావాలని రెచ్చగొట్టారు.  కానీ టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటునట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు.  పొత్తు ఖరారైన తర్వాత వైసీపీలో కొంత కలవర పాటు మొదలైంది. బీజేపీ ఈ కూటమిలో చేరకపోయినా వీరిని వ్యతిరేకించడం లేదు.. అలా అనీ అనుకూల ప్రకటన చేయడం లేదు. ఇదే సందర్భంలో బీజేపీలో ఉన్న టీడీపీ అనుకూల నేతలు ఆ పార్టీ అధిష్ఠానాన్ని ఒప్పించే పనిలో పడ్డారు.


తాజాగా బీజేపీ అధ్యక్షురాలు దిల్లీ పర్యటనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ మంత్రులు వరుస ప్రకటనలు చేస్తున్నారు. చంద్రబాబుని జైలు నుంచి విడిపించేందుకే ఆమె దిల్లీ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనికి ప్రతిగా బీజేపీ బదులిస్తూ కుటుంబ పార్టీల గురించి ఆలోచించాల్సిన అవసరం తమకు లేదని.. ఏపీ ప్రభుత్వ నకిలీ మద్యం కుంభకోణం గురించి ఫిర్యాదు చేసేందుకు దిల్లీ పెద్దలను కలిసినట్లు పేర్కొంటున్నారు. నకిలీ మద్యం ద్వారా వేలకోట్లు వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్తున్నాయని.. దీనిపై విచారించాలని వినతి పత్రం అందజేశారు. అప్పటి నుంచి వైసీపీ నేతలు పురంధేశ్వరిని లక్ష్యంగా చేసుకున్నారు.


దీనికి తోడు పురంధేశ్వరి నారా లోకేశ్‌ వెంట వెళ్లి అమిత్‌షా ను కలవడం కూడా వైసీపీకి నచ్చని అంశంగా మారింది. విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డిలు నేరుగా స్పందిస్తున్నారంటే ఏదైనా కుంభకోణం జరిగిందా.. లేక మరేదైనా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా.  బ్లూ మీడియాలో సైతం మద్యంపై వరుస కథనాలు వస్తున్నాయి. జనసేన, టీడీపీతో జట్టు కట్టకుండా ఉండేందుకు ఈ తరహా విమర్శలు చేస్తున్నారా లేక మరేదైనా విషయమా అనేది తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: