అమరావతిపై సుప్రీంకోర్టుకు జగన్‌.. వ్యూహం ఫలిస్తుందా?

విశాఖ రాజధానిగా పాలన సాగించాలనుకుంటున్న ఏపీ సీఎం జగన్ అందుకు చర్యలు ప్రారంభించారు. మూడు రాజధానుల అంశంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను జగన్ సర్కారు సుప్రీంకోర్టులో సవాలు చేసింది. అమరావతే రాజధాని అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని కోరిన ఏపీ ప్రభుత్వం ఆ పిటిషన్‌లో కోరింది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని జగన్ సర్కారు సుప్రీంకోర్టులో వాదిస్తోంది.

అమరావతే రాజధాని అనే హైకోర్టు తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని జగన్ సర్కారు సుప్రీంకోర్టును  విజ్ఞప్తి చేసింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని తన తీర్పులో హైకోర్టు సూచించిన సంగతి తెలిసిందే. సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని హైకోర్టు ఆదేశించడం శాసనసభ అధికారాలను ప్రశ్నించడమేనని జగన్ సర్కారు పిటీషన్ లో పేర్కొంది. అంతే కాదు.. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు జగన్ సర్కారు తన పిటీషన్ లో తెలిపింది.

సిఆర్డీఏ ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలంటూ గతంలో  హైకోర్టు తీర్పుపై జగన్ సర్కారు అసంతృప్తితో ఉంది. అంతే కాదు.. ఈ తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని కూడా తేల్చి చెప్పేసింది. ఏకంగా అసెంబ్లీలోనూ ఈ అంశంపై జగన్ సర్కారు  క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు జగన్ సర్కారు  ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు కూడా తెలిపింది.

అయితే.. హైకోర్టు తీర్పు వచ్చిన ఐదారు నెలల తర్వాత జగన్ సర్కారు ఇలా సుప్రీంకోర్టుకు వెళ్లడం చర్చనీయాంశమైంది. వాస్తవానికి హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే జగన్ సర్కారు సుప్రీం కోర్టుకు వెళ్లాలని భావించింది. అయితే.. సుప్రీంకోర్టు సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ ఉండటం వల్ల తమకు ఇబ్బందవుతుందని జగన్ సర్కారు  భావించింది. అందుకే ఆయన పదవీ విరమణ తర్వాత ఇప్పుడు తీరిగ్గా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు  సుప్రీంకోర్టు ఏం చెబుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: