రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న తెలంగాణ?
నిరుటితో పోలిస్తే.. గతేడాది ఈ సమయానికి కోటీ 21 లక్షల ఎకరాలే సాగయింది. ఈ సీజన్‌లో జులై నుంచి జోరుగా వర్షాలు కురుస్తుండటం కలసి వచ్చింది. దీంతో పాటు వర్షాలకు చెరువులు, వాగులు నిండటం వల్ల పంటల సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వరి 62.12 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. ఆ తర్వాత స్థానం పత్తిది. ఈ పంట 49.58 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. గతేడాది వానాకాలంలో రైతులు వరి పంటను 62 లక్షల ఎకరాల్లో వేస్తే ఈ సీజన్‌లో అంతకన్నా 20 లక్షల ఎకరాలు తగ్గించాలని వ్యవసాయ శాఖ మొదట చెప్పింది. కానీ ఇప్పటికే 62.12 లక్షల ఎకరాల్లో పంట వేశారు. ఈ సీజన్ ముగిసేనాటికి ఇంకా పెరగవచ్చు.
అయితే తెలంగాణ రాష్ట్రంలో పంటల సాగులో వైవిధ్యం లేకపోవడం ఓ ప్రధాన లోపంగా కనపిస్తోంది. వరి, సోయాచిక్కుడు మినహా.. ఇతర పంటలను పట్టించుకోవడం లేదు. వీటిని సాధారణంకన్నా అదనంగా వేయడం లేదు. దీని కారణంగా రాష్ట్రంలో పప్పులు, వంటనూనెల కొరత తీవ్రంగా ఉంటోంది. ఈ పప్పులు, వంటనూనెల పంటలు సాగు చేస్తే అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ ప్రచారం చేసినా పెద్దగా ఫలితం లేకపోయింది.
సాధారణంగా తెలంగాణ రాష్ట్రంలో పప్పు ధాన్యాలు, నూనెగింజల పంటల సాధారణ సాగు విస్తీర్ణం 15.41 లక్షల ఎకరాల్లో ఉంటుంది. అయితే.. ఈ ఏడాది కూడా రైతులు మాత్రం వీటిని సాధారణ విస్తీర్ణం కన్నా తక్కువగానే సాగు చేశారు. సాధారణం కంటే.. 4.38లక్షల ఎకరాలు తక్కువగా సాగు చేసినట్టు అధికారులు లెక్కలు చెబుతున్నాయి. పంటల సాగు విస్తీర్ణం పెరగడం మెచ్చుకోదగిన విషయమే అయినా.. ఆ పంటల తీరుపైలో వైవిధ్యం లోపించడం మాత్రం సరిచేసుకోవాల్సిన విషయమే.