కేసీఆర్‌.. ఆ భూములన్నీ అమ్మేస్తారా?

భూముల విలువలు బాగా పెరిగాయి. భూమి అందరికీ అత్యవసరంగా మారింది. తనకంటూ ఓ గూడు ఏర్పాటు చేసుకోవాలని ఎవరు మాత్రం అనుకోరు. అయితే.. ధరలు పెరగడమే కాదు.. ఆ స్థాయిలో మోసాలు కూడా పెరిగాయి. అందుకే.. రేటు ఎక్కువైనా ఎలాంటి లిటిగేషన్లు లేని భూములకు గిరాకీ ఎక్కువ. ఇక ప్రభుత్వమే భూములు వేలం వేస్తోందంటే.. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అందుకే సర్కారు భూములు వేలానికి డిమాండ్ ఎక్కువ.

అయితే.. ఇప్పటి వరకూ తెలంగాణ సర్కారు హైదరాబాద్ పరిధిలోని భూములే అమ్ముతోంది. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉన్న హౌసింగ్‌ బోర్డు భూములను వేలం వేసేందుకు ఆలోచిస్తోంది. హైదరాబాద్‌తో పాటుగా అనేక జిల్లాల్లో ఖాళీగా ఉన్న భూముల అమ్మకంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. డిమాండ్‌ బాగా ఉన్న, విలువైన భూములను ఇప్పటికే అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది.

ఈ భూముల అమ్మకం ద్వారా నిధులు సమీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం  సిద్ధం అవుతోంది.  త్వరలోనే  ఈ  భూముల అమ్మకం ప్రతిపాదనల్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాలని అధికారులు నిర్ణయించారు. ఒక్కసారి ఈ ప్రతిపాదనలకు  సీఎం ఆమోదం తెలిపితే.. తర్వాత భూముల వేలం ప్రక్రియ మొదలవుతుంది. తెలంగాణలోని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూముల అమ్మకం ద్వారా  రూ. 600-700 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కరోనా తర్వాత తగ్గిన నేపథ్యంలో అదనపు ఆదాయంపై తెలంగాణ సర్కారు దృష్టి పెట్టింది. ఇప్పటికే హెచ్‌ఎండీఏ ఒక దఫా హౌసింగ్‌ బోర్డు భూములు అమ్మేసింది కూడా. తొలి విడత వేలంలో దాదాపు రూ.470 కోట్ల ఆదాయం వచ్చింది. వివాదాలు లేనివి రెండో విడత భూముల అమ్మకం ద్వారా సుమారు రూ.2,380 కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. అటు ప్రజలకు కూడా ఇది చక్కటి అవకాశం. వివాదాలు లేని భూములను మార్కెట్ రేటుకు అనుగుణంగా దక్కించుకునే అవకాశం ఈ వేలం ద్వారా లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: