పవన్, బాబు కీచులాట.. మళ్లీ జగనే సీఎం?

ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉన్నా.. అప్పుడే ఎన్నికల పొత్తుల రాజకీయాలు మొదలయ్యాయి. గతంలో రెండు సార్లు మేం తగ్గాం కాబట్టి ఇప్పుడు తగ్గేది లేదంటున్నాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అంటే టీడీపీ తమతో పొత్తు పెట్టుకోవాలంటే అధిక సంఖ్యలో సీట్లు ఇవ్వడమే కాదు.. సీఎం సీటు కూడా తమకే ఇవ్వాలని పరోక్షంగా చెబుతున్నారు. కానీ.. టీడీపీ అందుకు ఏమాత్రం అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే.. ఈ ఇద్దరూ కీచులాడుకుని.. చివరకు పొత్తులు కుదరక విడివిడిగా పోటీ చేస్తే.. అది జగన్‌కు మరోసారి లాభదాయకం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అయితే.. వచ్చే ఎన్నిక‌ల్లో ప్రతిప‌క్ష పార్టీల‌న్నీ క‌లిసి పోటీ చేసినా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంట‌రిగానే పోటీ చేసే అవకాశమే ఉంది. పవన్ కళ్యాణ్‌ పొత్తుల కోసం మూడు ఆప్షన్‌లు ఇచ్చినా టీడీపీ ఇంకా దీనిపై అధికారికంగా ఏమీ స్పందించలేదు. అయితే..  రాజకీయాల్లో సీరియస్‌గా ఉన్నవాళ్లు ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తారని వైసీపీ అంటోంది. పవన్‌ ఓ విశ్లేషకుడిగా  ఆప్షన్లు మాత్రమే చెబుతున్నారని.. పాపం.. జనసేన తన పార్టీ అని పవన్ కళ్యాణ్ మర్చిపోయినట్లు ఉన్నారని వైసీపీ నేత సజ్జల సెటైర్‌ వేశారు కూడా.

అయితే.. పవన్ కల్యాణ్‌తో బీజేపీ వస్తుందో లేదో ఇంకా తేలలేదు.. టీడీపీతో వెళ్ళటం ఖాయమని పవన్ కళ్యాణ్ మాటలను బట్టి అర్థం అవుతోంది. అయితే ఇదంతా చంద్రబాబు గేమ్ ప్లాన్ ప్రకారమే  సాగుతోందేమో అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. జనసేన అధినేత పవన్‌  కార్యకర్తలను కాపాడుకునేందుకే ఈ పొత్తుల వ్యాఖ్యలు చేశారేమో అన్న విశ్లేషణలు కూడా లేకపోలేదు.

ప్రస్తుతానికి తగ్గేది లేదు.. తగ్గేది లేదు అంటున్న పవన్‌ కల్యాణ్‌.. చివరి వరకూ తగ్గకుండానే ఉంటే.. అది వైసీపీకే లాభిస్తుందని చెప్పక తప్పదు.. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ, జనసేన విడిగా పోటీ చేస్తే అది వైసీపీకి బ్రహ్మాండంగా కలిసి వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: