గొప్ప సినీ కవి.. అంత్యక్రియలకు మాత్రం ఎవరూ రాలేదు?

సినీ కవి, సాహితీ పరిశోధకుడు ఆరుద్ర గొప్పతనం గురించి కొత్తగా చెప్పాల్సిందేముంది.. అంతటి లబ్దప్రతిష్టుడాయన. అలాంటి కవి.. నిష్క్రమణ మాత్రం సాదాసీదాగా సాగిపోయింది. సినీ రంగంలో ప్రముఖులు ఎవరు చనిపోయినా.. సినీ రంగం అంతా తరలివస్తుంది..నివాళులు అర్పిస్తారు. అలాంటిది మరి అంతటి గొప్ప కవి మరణించిన తర్వాత ఆయన అంత్యక్రియలు మాత్రం అతి సాదాగా జరిగాయి.

ఎంత సాదాగా అంటే.. కేవలం ఆయన భార్య మాత్రమే పార్థివ దేహాన్ని ఆస్పత్రి నుంచి అంబులెన్సులో నేరుగా బిసెంట్ నగర్ శ్మశానవాటికకు తీసుకుపోయి దహన కార్యకమం ముగించేశారు. అస్థికలు కూడా వద్దని చెప్పి ఇంటికొచ్చి అప్పుడు ఆరుద్ర మరణ వార్తను కూతుళ్ళకు, కొద్ది మంది ఆత్మీయులకు ఫోన్ చేసి సమాచారం అందించారట. ఆమె అలా ఎందుకు చేశారు.. ఎందుకు చివరి చూపు కోసం ఎవరికీ చెప్పలేదు.. అంటే.. అందుకు ఎన్నో కారణాలు.

ఈ విషయం చెప్పాలంటే.. ఆరుద్ర, రామలక్ష్మిల గురించి కొన్ని విషయాలు చెప్పాలి. ఆరుద్ర సాంప్రదాయాలు, మూఢనమ్మకాలను పట్టించుకోని ఆధునిక వాది. అందుకే ఆయన బ్రాహ్మణుడైనా జంధ్యం వేయలేదు. అలాగే రామలక్ష్మి కూడా ఆయనకు తగ్గ భార్య. వారిద్దరూ భార్యాభర్తలైనా.. ఆమెను సంప్రదాయబద్దంగా వివాహం చేసుకోలేదు. తాళి కట్టలేదు. ఆయన మరణం విషయంలోనూ అంతే కావచ్చు.

చావు, పుట్టుకలు సహజం అని భావించే రామలక్ష్మి.. అలా నిరాడంబరంగా ఆరుద్ర అంత్యక్రియలు కానిచ్చేసారు. దీనికి మరో అంశం కూడా కారణం కావచ్చంటారు తెలిసిన వారు. అదేమిటంటే.. శ్రీశ్రీ చనిపోయినప్పుడు ఆయన అంత్యక్రియలు మేం చేయిస్తాం అంటే మేం చేయిస్తాం అని అభ్యుదయ రచయితల సంఘం వారు.. విప్లవ రచయితల సంఘం వారు పోట్లాడుకున్నారట. అది చాలా చిరాకనిపించిందని ఒకసారి రామలక్ష్మి గారు అన్నారని చెబుతారు. బహుశా అప్పుడే అంత్య క్రియల మీద ఇద్దరూ ముందే ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటారని ఆ కుటుంబంతో ఆత్మీయ బంధం ఉన్న సీనియర్ జర్నలిస్టు తోట భావ నారాయణ గుర్తు చేసుకున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: