తెలంగాణ తొలి పత్రిక ఏదో.. ఎలా వెలుగు చూసిందో తెలుసా?

ఏదైనా ఒకటి ప్రారంభించడం ఎప్పుడూ కష్టమే.. అందులోనూ అంతకు ముందు ఎవరూ చేయని పని చేయాలంటే.. అందుకు చాలా ధైర్యం ఉండాలి.. తపన ఉండాలి.. పత్రిక రూపొందించడం కూడా అలాంటిదే.. తెలంగాణలో మొదటి పత్రిక ఏది.. ఈ ప్రశ్నకు సమాధానంగా చాలా కాలం నీలగిరి పత్రిక అని చెప్పుకునేవారు.. అప్పటి చరిత్ర కారులు అదే అనుకున్నారు. కానీ.. అసలు తెలంగాణలో వచ్చిన మొదటి పత్రిక శేద్య చంద్రిక అట.

ఈ విషయం కూడా చాలా ఏళ్ల తర్వాత బయటకు వచ్చింది. ఈ విషయం గురించి సీనియర్ జర్నలిస్టు తోట భావనారాయణ తన ఫేస్‌ బుక్‌ పోస్టులో తెలియ జేశారు. ఆసక్తికరమైన ఆ వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ గా రిటైరైన డాక్టర్ పి.ఎస్. గోపాలకృష్ణ ఆ రోజుల్లో మద్రాసులో జర్నలిస్టు తోట భావనారాయణ గారికో విషయం చెప్పారట. అదేంటంటే.. బంగోరె ఒకసారి మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంధాలయంలో ‘శేద్య చంద్రిక’ అనే పత్రిక ప్రతి చూశారని చెప్పారట. అయితే.. అది చాలా పాత పత్రిక అయ్యే అవకాశముందని చెబుతూ దానిమీద ఒక వ్యాసం రాయమని తోట భావనారాయణకు సూచించారట.

తోటభావనారాయణ.. కష్టపడి దాని ఆచూకీ తెలుసుకొని వివరణాత్మకంగా ఒక వ్యాసం రాశారట. అయితే.. ఆ శేద్య చంద్రిక పత్రిక ప్రచురితమైన సంవత్సరాన్ని కచ్చితంగా లెక్కగట్టటం ఎలాగో తెలియలేదట. అదే కదా అసలు కీలకమైన అంశం. ఆ సమయంలో తోట భావనారాయణ సాహితీ పరిశోధకుడుగా లబ్దప్రతిష్టులైన ఆరుద్రగారిని సంప్రదించారట. ఆరుద్ర గారు ఆ ప్రతిని పరిశీలించి, లెక్కలు గట్టి అది 1883 సంవత్సరంలో ముద్రితమైంది అని నిర్థారించారట.  దీంతో ఇదే తెలంగాణ తొలిపత్రిక అని తేలిపోయింది. అప్పటిదాకా అనుకుంటున్న నీలగిరి పత్రిక కాదని.. శేద్య చంద్రికే పాత తెలంగాణ పత్రిక అని రూఢీ అయ్యింది.

దీంతో.. అప్పట్లో ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధం ఎడిటర్ విజయబాబు రెండు ఆదివారాలు రెండు భాగాలుగా వేసి ఈ వ్యాసానికి తగిన ప్రాచుర్యం కల్పించారట. అదే సమయంలో పాత రచనల కాల నిర్ణయంలో సమస్యలు ఎలా వస్తాయో.. వాటిని ఎలా పరిష్కరించాలో ఆరుద్ర తోట భావనారాయణగారితో చెప్పుకొచ్చారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: