రైతులకు జగన్‌ మరో గుడ్‌న్యూస్.. ఇక ట్రాక్టర్లు?

రైతులకు తక్కువ అద్దెతో వ్యవసాయ యంత్ర పరికరాలు అందుబాటులోకి తెచ్చే వైఎస్సార్ యంత్రసేవా పథకాన్ని మరింతగా విస్తరించనున్నారు. ఇప్పటి వరకూ కేవలం చిన్నచిన్న పరికరాలను మాత్రమే అందుబాటులో ఉంచిన ప్రభుత్వం ఇకపై ట్రాక్టర్లను రైతులకు అద్దెకిచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ పథకం ద్వారా గ్రామాల్లోని రైతులకు ఈ ట్రాక్టర్లను అద్దెప్రాతిపదికన అందుబాటులో ఉంచుతారు. ప్రతి మండలంలో 5లేదా 6 ట్రాక్టర్లు ఉండేలా ప్రణాళికలు రూపొందించారు.

ఈనెల 7వ తేదిన గుంటూరులో ఈ ట్రాక్టర్లను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. దీనికోసం ట్రాక్టర్లతో ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరుగుతోంది. కూలీల సమస్యతో చాలారకాల వ్యవసాయ పనులు యంత్రాలతోనే చేయాల్సిన పరిస్థితి వస్తోంది. సన్న, చిన్నకారు రైతులు ఆ యంత్రాలు, పరికరాలు కొనలేకపోతున్నారు. అందుకే రైతు భరోసా కేంద్రాల పరిథిలో కమ్యూనిటి హైరింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని జగన్ సర్కారు భావిస్తోంది.

అక్కడ యంత్ర పరికరాలను అద్దె ప్రాతిపదికన అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం చెబుతోంది. దీనికి వైఎస్సార్ యంత్రసేవా పథకం అని పేరు కూడా పెట్టారు. అయితే రెండేళ్ల నుంచి ఈ పథకం పూర్తిస్థాయిలో పట్టాలు ఎక్కలేదు. అరకొర యంత్రాలు మాత్రమే అందుబాటులో ఉంచారు. పవర్‌ రీడర్లు, ప్యాడి రేపర్స్‌, కల్టివేటర్స్‌, దుక్కి యంత్రాలు, రోటావేటర్‌, నూర్పిడి యంత్రాలు, స్ర్పేయర్లు,  బ్రెష్‌ కట్టర్‌, కేజీవీల్స్‌ వంటి పరికరాలతో పాటు ట్రాక్టర్లు కూడా ఉంటేనే రైతులకు మేలు జరుగుతుంది.

కానీ ఇప్పటి వరకూ  వీటిలో ఒకటి రెండు మాత్రమే ఉంటున్నాయి. అందుకే ఇప్పుడు అన్నిచోట్లా ట్రాక్టర్లు కూడా ఉండేలా చర్యలు చేపట్టారు. ప్రతి ఆర్బీకే పరిధిలోని కమ్యూనిటి హైరింగ్ కేంద్రంలో ట్రాక్టర్ ఉండేలా ప్లాన్  రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్బీకేలకు 3వేల 800 ట్రాక్టర్లను పంపిణి చేయనున్నారు. రైతులు సంఘాలుగా ఏర్పడి ముందుకు వస్తే వీటిని అందిస్తారు. 10శాతం రైతులు, 40శాతం రాయితీ పోగా.. మిగతా 50శాతం డిసిసిబిల ద్వారా రుణం రూపంలో సమకూరుస్తారు. ఇదేదో బావుంది కదా..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: