ఇండియాకు గుడ్‌న్యూస్‌.. పేదరికం తగ్గిందట?

దేశంలో పేదరికం తగ్గిందంటున్నారు ప్రధాని మోదీ.. ఈ విషయం గురించి ప్రపంచ బ్యాంకు సైతం మాట్లాడుతోందంటున్నారు. గత8 ఏళ్ల కాలంలో అవినీతి రహిత, పారదర్శక పాలనతో దేశం గొప్ప మార్పును చూసిందని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నారు. ఎన్డీఏ పాలనకు ఎనిమిదేళ్లు పూర్తైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే యూపీఏ ప్రభుత్వ పాలనపై మోదీ విమర్శలు గుప్పించారు.  2014కు ముందు అవినీతి అనేది ప్రభుత్వంలో భాగంగా చూసేవారంటున్నారు మోదీ. తమ ప్రభుత్వం అవినీతి రహిత, పారదర్శక పాలనకు పెద్దపీట వేసిందన్నారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం.. వివిధ పథకాల్లో అనర్హులుగా ఉన్న 9కోట్ల మంది పేర్లను తొలగించామని మోదీ వివరించారు.  వివిధ పథకాల కింద సుమారు 22 లక్షల కోట్ల రూపాయలను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశామన్నారు. ప్రత్యక్ష బదిలీ ద్వారా ప్రభుత్వ పథకాల అమల్లో అవినీతిని రూపుమాపామన్నారు. తమ పాలనలో దేశంలో పేదరికం తగ్గిందన్న మోదీ.. అంతర్జాతీయ సంస్థలు సైతం ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయన్నారు.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 11 వ విడత నిధులను రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ బదిలీ  చేశారు. 2014 కంటే ముందు రోజూ వార్తాపత్రికల్లో హెడ్‌లైన్లుగా వచ్చేవని మోదీ అన్నారు. వాటిపైనే టీవీల్లో చర్చలు నడిచేవని మోదీ అన్నారు.  దోపిడీలు, అవినీతి, కుంభకోణాలు, బంధుప్రీతి, పనికిరాని పథకాల గురించి అప్పట్లో వార్తలు వచ్చేవని మోదీ అన్నారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వ పథకాల లబ్ధి గురించి చర్చ జరుగుతోందని మోదీ అన్నారు.

ఇప్పుడు అంతర్జాతీయంగా భారత్‌లోని అంకుర పరిశ్రమల గురించి మాట్లాడుకుంటున్నారని.. భారత్‌లోని సులభతర వాణిజ్య విధానం గురించి ప్రపంచ బ్యాంకు సైతం మాట్లాడుతోందని మోదీ అన్నారు. 2014కంటే ముందు ప్రభుత్వం అవినీతిని వ్యవస్థలో భాగం చేసిందని... ప్రస్తుత ప్రభుత్వం అవినీతిని ఏమాత్రం ఉపేక్షించకుండా పనిచేస్తోందని మోదీ అన్నారు.  2014 కంటే ముందు దేశ భద్రతపై ఆందోళన ఉండేదని.. కానీ సర్జికల్ స్ట్రైక్స్‌, వైమానిక దాడుల తర్వాత మన సరిహద్దులు మరింత సురక్షితంగా మారాయని మోదీ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: