జగన్‌.. తప్పు దిద్దుకోపోతే చెడ్డ పేరు ఖాయం?

గ్రూప్‌ వన్‌ పోస్టుల ఎంపిక వివాదం జగన్‌ సర్కారుకు చెడ్డ పేరు తీసుకొస్తోంది. ఇటీవల జరిగిన గ్రూప్‌ వన్ ఫలితాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ పరీక్షలను మొదటి డిజిటల్ విధానంలో వ్యాల్యూయేషన్ చేశారు. ఫలితాలు ప్రకటించారు. అయితే డిజిటల్ వ్యాల్యూయేషన్‌ పై కొందరు కోర్టుకు వెళ్లారు. ముందు తమకు డిజిటల్ వాల్యుయేషన్‌ గురించి చెప్పలేదని కోర్టుకు వివరించారు. కోర్టు మాన్యువల్ వాల్యుయేషన్‌ కూడా చేయాలని తీర్పు ఇచ్చింది.

ఆ తర్వాత మాన్యువల్ వాల్యుయేషన్ జరిగింది. సాధారణంగా వాల్యుయేషన్‌లో ఎలాంటి అక్రమాలు లేకపోతే.. రెండు జాబితాల్లోనూ పెద్దగా మార్పులు రాకూడదు. కానీ.. ఈ రెండు వ్యాల్యుయేషన్లలో ఏకంగా జాబితాలే మారిపోయాయి. ఇప్పుడు మొదట ఇంటర్వ్యూలకు ఎంపికై ఇప్పుడు అవకాశం కోల్పోయినవారు ఆందోళన చేస్తున్నారు. అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు.

పరీక్షల్లో ప్రశ్నలు-జ‌వాబులు మార‌న‌ప్పుడు ఈ స్థాయిలో డిజిట‌ల్ మాన్యువ‌ల్ వేల్యూయేష‌న్‌లో తేడాలు ఎందుకు వచ్చాయన్నది అర్థం కాని ప్రశ్నగా మారింది. ఎవ‌రి కోసం ఇలా తారుమారు జరిగందన్న విషయంపై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. మొదటి జాబితాలో స్పోర్ట్స్ కోటాలో ఇంట‌ర్వ్యూకి 75 మంది ఎంపికయ్యారు. మూడునెల‌ల్లో పూర్తి చేయాల్సిన‌ మాన్యువ‌ల్ వాల్యుయేష‌న్‌ని 8 నెల‌లు సాగ‌దీసినా.. ఇప్పుడు వారిలో 48 మందికి మాత్రమే తిరిగి ఎంపికయ్యారు.

డిజిట‌ల్‌, మాన్యువ‌ల్ వేల్యూయేష‌న్‌లో 202 మంది వరకూ తేడా వస్తున్నారు. ఇంట‌ర్య్వూల ఎంపిక‌లో అక్రమాల‌ కారణంగా వంద‌లాది మంది ప్రతిభావంతుల‌కు తీర‌ని అన్యాయం జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయి. డిజిట‌ల్ విధానంలో ఎంపికైన‌ 326 మందిలో కేవలం 124 మంది మాత్రమే మాన్యువ‌ల్ వేల్యూయేష‌న్‌లో ఎంపిక కావ‌డం అనుమానాలకు తావిస్తోంది. దీనిపై జగన్ సర్కారు సమగ్రంగా విచారణ జరిపించకపోతే.. ఇది జగన్ సర్కారుకు చెడ్డపేరు తీసుకురావడం ఖాయం. గ్రూప్‌ వన్‌ వంటి పెద్ద స్థాయి పోస్టుల్లో నియామక ప్రక్రియ పారదర్శకుంగా లేకపోతే విమర్శలు తప్పువు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: