మోడీ చేసింది అరాచకం.. రుజువు చూపిన ఆర్‌బీఐ?

నరేంద్ర మోదీ ప్రధానిగా తీసుకున్న అనేక వివాదాస్పద నిర్ణయాల్లో పెద్ద నోట్ల రద్దు అనేది ఎప్పటికీ నెంబర్‌ వన్ గానే ఉంటుంది. 2016లో అప్పటి మోదీ ప్రభుత్వం అమలులో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను ఉన్నపళంగా రద్దు చేసేసింది. ఇది అప్పట్లో ఓ పెద్ద సంచలనం.. అవినీతిని అరికట్టడం, డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించడం, నకిలీ నోట్లను నివారించడం కోసమే ఈ  నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో మోదీ సర్కార్‌ చెప్పుకొచ్చింది.

మోదీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు నాలుగైదు నెలలు జనం తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అన్ని వ్యాపారాలు దెబ్బ తిన్నాయి. చిరు వ్యాపారులు కుప్పకూలారు.. అయితే.. దేశం కోసం దేశం మంచి కోసం ఓ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు సహజమే. ఆ నిర్ణయం దీర్ఘకాలంలో అయినా మంచి చేస్తే చాలు..కానీ.. నోట్ల రద్దు వల్ల దేశానికి నష్టమే తప్ప లాభం ఏమీ జరగలేదని ఇప్పటికే అనేక నివేదికలు చెబుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఆర్‌బీఐ కూడా అదే మాట చెప్పింది.

పెద్దనోట్ల రద్దుతో నకిలీ నోట్లు తగ్గిపోతాయని ప్రభుత్వం చెబితే.. గత మూడేళ్లుగా నకిలీ నోట్లు విపరీతంగా పెరిగాయని సాక్షాత్తూ ఆర్‌బీఐ చెబుతోంది. ప్రధానంగా రూ.500 నకిలీ నోట్లు 101.9 శాతం పెరిగాయని ఆర్‌బీఐ నివేదిక చెప్పింది. అలాగే రూ.2,000 ఫేక్‌ నోట్లు 54.16 శాతం ఎక్కువయ్యాయని ఆర్‌బీఐ నివేదిక చెప్పింది. ఒక్క రూ.50, రూ.100 నోట్లు తప్ప మిగిలిన అన్ని నకిలీ నోట్లు బాగా పెరిగిపోయినట్టు ఆర్‌బీఐ నివేదిక చెప్పింది.

ఇప్పుడు ఈ ఆర్‌బీఐ నివేదిక ఆధారంగా విపక్షాలు మోదీ సర్కారును తూర్పారపడుతున్నాయి. నకిలీ నోట్ల బెడద తీరిపోతుందని ఎలా హామీ ఇచ్చారని ప్రశ్నిస్తున్నాయి. ఎట్టకేలకు నోట్ల రద్దు ప్రతిఫలం ఇలా దక్కిందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి. నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి జారుకోవడం తప్ప ఎలాంటి ప్రయోజనాన్నీ చేకూర్చలేదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: