ఓహో.. ఏపీలోనే విద్యుత్ కోతలు తక్కువంట?


ఏపీలో కొ‌న్ని రోజులుగా విద్యుత్ కోతలు తప్పడం లేదు. పరిశ్రమలకు రెండు రోజులు పవర్ హాలీడే కూడా ప్రకటించారు. అయితే.. దేశంలో విద్యుత్ కొరత చాలా ఉందని.. అనేక రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయని.. ఇంకా ఏపీలోనే విద్యుత్ కోతలు తక్కువ అంటున్నారు విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. విద్యుత్ కొరతను తీర్చే విషయంలో.. కొత్త విద్యుత్ ప్రాజెక్టులను వేగవంతం చేయాల్సి ఉందని సదరు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెబుతున్నారు. సచివాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష నిర్వహించారు.

ఏపీ రాష్ట్రంలో కొత్త విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణ పురోగతిపై మంత్రి పెద్దిరెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరో 3 నెలల్లో ఎన్టీపీసీ స్టేజ్ -5 పూర్తి చేయాలని మంత్రి పెద్దిరెడ్డి అధికారులను ఆదేశించారు. కృష్ణపట్నం స్టేజ్ -2 ప్లాంట్ నిర్మాణం వేగవంతం చేయాలని మంత్రి పెద్దిరెడ్డి  సూచించారు. ఈ రెండు ప్లాంట్లు వినియోగంలోకి వస్తే... ప్రస్తుత సామర్థ్యానికి అదనంగా 16 వందల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరించారు.

ఇక ముందు కొత్త హైడల్ ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  సూచించారు. దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత తీవ్రంగా ఉందని... ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.... ఏపీలోనే విద్యుత్ కోతలు తక్కువని మంత్రి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  వ్యాఖ్యానించడం విశేషం. అయితే మంత్రి మాటలు విన్న వారు.. ఔనా అంటూ కాస్త వ్యంగ్యంగా బదులిస్తున్నా.. వాస్తవం కూడా అలాగే ఉంది. దేశవ్యాప్తంగా విద్యుత్‌ డిమాండ్ అధికంగా ఉంది.

బహిరంగ మార్కెట్లో కొందామన్నా విద్యుత్ దొరికే పరిస్థితి లేదు. ఈ సమయంలో విద్యుత్ కోతలు తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. గుజరాత్ వంటి రాష్ట్రంలోనూ విద్యుత్ కోతలు ఉంటున్నాయని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం కూడా విద్యుత్ కోతలపై ఉందని వారు గుర్తు చేస్తున్నారు. అయితే.. ఏ రాష్ట్రం సంగతి ఎలా ఉన్నా.. మాకు విద్యుత్ కావాలి మొర్రో అంటున్నారు ఏపీ వాసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: