నెల్లూరులో అనిల్ వర్సెస్ కాకాణి.. వార్ ముదురుతోందా?

నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల మధ్య వర్గ పోరు ముదురుతోందా.. నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్  గ్రూపుల మధ్య గొడవలు తీవ్రస్థాయికి చేరాయా.. అంటే అవునంటోంది ఓ వర్గం మీడియా.. అంతే కాదు.. తాను మంత్రిగా ఉన్నప్పుడు కాకాణి తనకు బాగా సహకరించారని.. ఇప్పుడు తాను డబుల్‌గా సహకరిస్తానంటూ అనిల్ చెప్పిన మాటల్లో వ్యంగ్యం ఉందని కథనాలు వస్తున్నాయి. అంతే కాదు.. కాకాణికి పోటీగా అనిల్ ఓ సభ పెడుతున్నాడని.. అంతే కాదు.. మంత్రి పదవి రాని మరో నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలసి గ్రూపు రాజకీయాలు నడుపుతున్నాడని కథనాలు వస్తున్నాయి.

ఇదే సమయంలో నెల్లూరు మన్సిపల్ అధికారులు మంత్రి కాకాణి ఫ్లెక్సీని తీసేయడం కూడా వివాదానికి దారి తీసింది. ఇది అనిల్ చేయించిన పనే అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ మొత్తం వ్యవహారంపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. నెల్లూరు జిల్లా వైసీపీలో ఎలాంటి వర్గాలు లేవంటున్నారు. పార్టీలో ఉన్నవారంతా జగన్‌ సైనికులే అంటున్నారు అనిల్. అసలు గ్రూపులు కట్టాల్సిన అవసరం త‌మ‌కు లేదని అదంతా గిట్టని మీడియా చేస్తున్న దుష్ప్రచార‌మేనని మండిపడుతున్నారు.

తాను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని కలిసి సంఘీభావం తెలపడంలో రాజకీయం ఏమీ లేదని.. ఇటీవలే కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డితోనూ భేటీ అయ్యానని.. అందులోనూ రాజకీయం లేదని చెబుతున్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో వీరు బాగా సహకరించారని.. అలాంటి ఎమ్మెల్యేలను కలిస్తే తప్పేముందని ప్రశ్నించారు. అలాంటి ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలపాల్సిన బాధ్యత తనకు ఉందని.. సొంత పార్టీ ఎమ్మెల్యేలను కలవడం కూడా తప్పేనా అని అనిల్ ప్రశ్నించారు.

అంతే కాదు.. నెల్లూరు కార్పొరేషన్ సిబ్బంది ఫ్లెక్సీలు తీసినా తనపైనే దుష్ప్రచారం చేస్తున్నారని.. ఇదెక్కడి న్యాయమని మాజీ మంత్రి అనిల్‌కుమార్ అంటున్నారు. తప్పుడు ప్రచారాలతో వైయ‌స్ఆర్ సీపీలో చిచ్చుపెట్టలేరని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: