షాకింగ్‌: సాక్షి టీవీ అనుమతుల రద్దు నిజమేనా?

ఏపీ సీఎం జగన్ సొంత ఛానల్‌ సాక్షి టీవీ అన్న సంగతి తెలిసిందే. ఈ సాక్షి టీవీ ఛానల్‌కు అనుమతులు రద్దయ్యాయా.. గతంలో ఇచ్చిన అనుమతుల గడువు తీరిపోయిన తర్వాత కేంద్రం వాటిని పునరుద్ధరించలేదని.. అందువల్ల సాక్షి టీవీ అనుమతులు రద్దయ్యాయని.. గతంలోనే జగన్ వ్యతిరేక మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిని సాక్షి మీడియా కూడా పెద్దగా ఖండించలేదు. అయితే.. ఇప్పుడు సాక్షి టీవీ అనుమతుల రద్దు వాస్తవమేనని సాక్షాత్తూ కేంద్ర సమాచార ప్రసార శాఖే లిఖిత పూర్వకంగా వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి.


జగన్ వ్యతిరేక మీడియాలోనూ.. టీడీపీ అనుకూల గ్రూపుల్లోనూ ఈ వార్త చక్కర్లు కొడుతోంది.  సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారానికి కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ కార్యదర్శి విజయ్‌ కౌశిక్‌ అధికారికంగా సమాధానం ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. సాక్షి టీవీకి అనుమతులు రద్దుచేస్తూ తమ శాఖకు చెందిన మరో సహాయ కార్యదర్శి సోనియా ఖట్టర్‌ జారీ చేసిన ఉత్తర్వు ప్రతిని కూడా ఆయన జతపరిచారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.


సాక్షి టీవీ పేరిట వార్తలను ప్రసారం చేసేందుకు ఇందిరా టెలివిజన్‌ లిమిటెడ్‌ కు అప్‌ లింకింగ్‌, డౌన్‌ లింకింగ్‌ కోసం 2006 జూలై 7న పదేళ్ల కాలపరిమితి ఉందట. 2016తోనే ఆ అనుమతికి గడువు తీరిందని.. దీన్ని పొడిగించుకునేందుకు సాక్షి టీవీ పెట్టుకున్న దరఖాస్తును కేంద్ర హోంశాఖ నిరాకరించిందని ప్రచారం జరుగుతోంది. సాక్షి ఛానల్‌ కు భద్రతాపరమైన అనుమతులు మంజూరు చేసేందుకు కేంద్ర హోం శాఖ అనుమతివ్వలేదు కాబట్టి తాము అనుమతులు రద్దు చేసినట్టు కేంద్ర సమాచార శాఖ లిఖిత పూర్వకంగా చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.


అయితే.. ఈ ప్రచారంలో ఎంత వరకూ వాస్తవం ఉందో తెలియదు. ఈ అంశంపై సాక్షి టీవీ స్పందించే అవకాశం కూడా తక్కువే. ఒకవేళ అనుమతుల రద్దు నిజమే అయితే.. మరి ఇంకా సాక్షి టీవీ ప్రసారాలు బ్రహ్మాండంగానే వస్తున్నాయి కదా. వీటిని సమాచార ప్రసార శాఖ పట్టించుకోకుండా ఉంటుందా. మరి ఇప్పటి వరకూ చర్యలు ఎందుకు తీసుకోలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే చర్యలు ఉంటాయా.. అసలు ఆ అనుమతులు అంతగా అవసరం లేదా.. ఇవన్నీ జవాబు లేని ప్రశ్నలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: