కేసీఆర్‌.. కొట్లాట కావాలా? పరిష్కారం కావాలా?

తెలంగాణ ప్రభుత్వాధినేత కేసీఆర్‌ ఇటీవల తరచూ కేంద్రంతో లడాయి పెట్టుకుంటున్న సంగతి తెలిసిందే. మోడీ సర్కారుపై కేసీఆర్ సమర శంఖం పూరించారు. తాజా ధాన్యం కొనుగోళ్ల అంశంపై టీఆర్‌ఎస్‌ బీజేపీ మధ్య పోరు మామూలుగా లేదు. కేంద్రం కావాలనే తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందని తెలంగాణ సర్కారు అంటుంటే.. అబ్బే.. తెలంగాణ ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు విషయంలో ఒప్పందాల ప్రకారం ముందుకు రావట్లేదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అంటున్న సంగతి తెలిసిందే.

ఈ అంశంపై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..  ధాన్యం సేకరించని కేసీఆర్ కు ఓట్లు, సీట్లు, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనే హక్కు లేదని మండిపడుతున్నారు. కేసీఆర్‌కు సమస్య పరిష్కారం కావాలా? కొట్లాట కావాలో తేల్చుకోవాలని బండి సంజయ్ డిమండ్ చేస్తున్నారు. పియూష్ గోయాల్ అవమానిస్తే.. రోషం, పౌరుషం లేకుండా మంత్రులు ఎందుకు ఊరుకున్నారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్‌ చేశారు.

రైతులు తరిమికొడతారన్న భయంతో నెపాన్ని కేసీఆర్ కేంద్రంపై వేస్తున్నారని.. ఇతర రాష్ట్రాలో లేని ధాన్యం సమస్య.. తెలంగాణలో మాత్రమే ఎందుకు సృష్టిస్తున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీల పెంపును పక్కదారి పట్టించేందుకే.. మంత్రుల ఢిల్లీ పర్యటన ఏర్పాటు చేశారని బండి సంజయ్ విమర్శించారు. ఉమ్మడి ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచితే ఏంజరిగిందో అందరకీ తెలుసన్న బండి సంజయ్.. ఫాంహౌస్ లో వరి పండిస్తున్నారో.. గంజా పండిస్తున్నారో కేసీఆర్ చెప్పాలన్నారు.

కేసీఆర్ ఫాంహౌస్ లో పండిస్తోన్న వరి ఎక్కడ అమ్ముతారని ప్రశ్నించిన బండి సంజయ్... కొనుగోలు కేంద్రాలను ఎత్తేసే హక్కు ముఖ్యమంత్రికి లేదన్నారు. మంత్రులు, టీఆర్ఎస్ నేతల అవినీతిపై సీబీఐ విచారణ కోరే దమ్ము కేసీఆర్ కు ఉందా అని బండి సంజయ్ ప్రశ్నించారు. రైస్ మిల్లర్లతో కుమ్మక్కు అయ్యి కేసీఆర్ కేంద్రం నిధులు దోచుకుంటున్నారని.. తాను చేసిన పొరపాటును ఒప్పుకుని కేసీఆర్ కేంద్రంతో మాట్లాడాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: