జగన్ ఎదురుదాడి.. వ్యవస్థల మధ్య మరోసారి ఘర్షణ?

మూడు రాజధానుల నిర్ణయంపై హైకోర్టు ఈనెల ఆరంభంలో ఇచ్చిన తీర్పుపై నిన్న ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో జరిగిన స్వల్ప కాలిక చర్చలో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగమే సుప్రీం అని.. ఈ రాజ్యాంగంలో వ్యవస్థల మధ్య ఘర్షణ వాతారవణం ఉండకూడదన్న విషయాన్ని గుర్తు చేశారు. శాసన వ్యవస్థ పనుల్లోకి న్యాయవ్యవస్థ తన పరిధి దాటి జోక్యం చేసుకుంటోందన్న జగన్.. ఇది ఏమాత్రం వాంఛనీయం కాదన్నారు. రాజధాని అమరావతిలో రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ, విద్యుత్‌ వంటి మౌలిక వసతులను నెలరోజుల్లోనే కల్పించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సాధ్యమా అని అని జగన్ ప్రశ్నించారు.

అమలు చేయలేని తీర్పులను కోర్టులు ఇవ్వరాదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు తీర్పు ఉందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు సాధ్యంకాదన్న జగన్.. వికేంద్రీకరణపై వెనక్కి తగ్గేదిలేదన్నారు. ఇదే సమయంలో ఏపీ సీఎం జగన్
వ్యవస్థల మధ్య ఘర్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థ తన పరిధి దాటి మరీ తీర్పు ఇచ్చిందనిపిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్.. మూడు రాజధానులపై నిర్ణయం తీసుకునే హక్కు అసెంబ్లీకి ఉందన్నారు. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు రాజ్యాంగాన్నేకాకుండా శాసనసభ అధికారాలనే ప్రశ్నార్థకం చేస్తోందనడం ద్వారా సీఎం జగన్‌ సమర శంఖం మరోసారి పూరించారు.

హైకోర్టు తీరు సమాఖ్య స్ఫూర్తికి, శాసన అధికారాలకు విరుద్ధమని జగన్ చర్చకు తెర తీశారు. అసలు న్యాయ వ్యవస్థ చట్టాలు చేస్తుందా అని ప్రశ్నించడం ద్వారా జగన్... శాసన వ్యవస్థ, న్యాయవ్యవస్థల మధ్య జరుగుతున్న ఘర్షణకు అద్ధం పట్టేలా వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం, ఏపీ హైకోర్టుల మధ్య ఈ ఘర్షణ వాతావరణం దేశంలో మరోసారి మూడు వ్యవస్థల మధ్య సంబంధం, అధికార విభజన, సమన్వయం అంశాలపై చర్చకు దారి తీస్తున్నాయి.

భారత రాజ్యాంగం శాసన, కార్యనిర్వహాక, న్యాయ వ్యవస్థలకు సమాన, స్పష్టమైన అధికారాలు ఇచ్చింది. ఒకదాని పరిధిలోకి మరొకటి వెళ్లకుండా అధికారవిభజన చేసింది. అయినప్పటికీ ఇలాంటి వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. మరి ఏపీ హైకోర్టు, ప్రభుత్వం మధ్య యుద్ధం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: