టార్గెట్‌ 2024: జగన్‌కు సవాల్ విసిరిన పవన్?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ఎన్నికల శంఖారావం పూరించారు. సరిగ్గా రెండేళ్ల ముందే ఎన్నికల సమీకరణాల కసరత్తుకు మూహూర్తం పెట్టేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కారును దింపుతానని పవన్ కల్యాణ్‌ పరోక్షంగా చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసితీరుతానని గుంటూరు జిల్లా ఇప్పటంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో సవాల్ చేశారు.


వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటానని స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు ఇచ్చే రోడ్‌ మ్యాప్‌ కోసం ఎదురుచూస్తున్నానన్న పవన్ కల్యాణ్.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తుల గురించి ఆలోచిస్తానని చెప్పేసారు. విధ్వంస వైసీపీని గద్దె దించడమే తొలి ప్రాధాన్యమని పవన్‌ కల్యాణ్‌ క్లారిటీ ఇచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించి తీరుతామన్న పవన్‌.. ఆంధ్రప్రదేశ్‌ బాధ్యతను నేను తీసుకుంటానన్నారు.


అంటే దీని అర్థం ఏంటి.. పవన్ కల్యాణ్ టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకుంటున్నాడని తేల్చి చెప్పేశాడు.. వైసీపీని ఒంటరిగా ఎదుర్కోనని... అలా చేస్తే వైసీపీ వ్యతిరేక ఓటు చీలుతుందని చెప్పేశాడు. అయితే టీడీపీతో పొత్తుకు బీజేపీ కూడా సిద్దంగా ఉందా లేదా అన్న విషయంపై క్లారిటీ లేదు. కానీ.. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాత్రం ఇప్పటికీ వైసీపీని ఎంత తిడతారో.. అంత కంటే ఎక్కువగా టీడీపీని కూడా తిడుతుంటారు. మరి అలాంటి సోము వీర్రాజు టీడీపీతో పొత్తుకు ఒప్పుకుంటారా అన్నది తేలాలి.


మరో వాదన ఏంటంటే.. ఏపీ బీజేపీ చీఫ్‌గా సోము వీర్రాజును తీసేసి.. వేరకొరని పెడతారన్న వార్తలు కూడా వస్తున్నాయి. మొత్తానికి ఏపీ ఎన్నికల పిక్చర్‌ దాదాపు రెండేళ్ల ముందే ఓ క్లారిటీకి వచ్చేసిందన్నమాట. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒకవైపు.. మిగిలిన టీడీపీ, జనసేన, బీజేపీ మరో వైపు పోరాటానికి సిద్ధమవుతున్నాయన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: