మోడీకి ముఖం చూపని కేసీఆర్.. సాధించిందేంటి..?
ఇందుకు కారణంగా జ్వరం అని మీడియాలో చెబుతున్నారు. అయితే.. ఇది కేవలం మోడీపై కోపం, అసంతృప్తి, కినుక మాత్రమే కారణం అన్న సంగతి జగద్విదితం.. ఈ దేశ ప్రధానిది కురుచ బుద్ది అని బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజే సీఎం కేసీఆర్ విమర్శించిన సంగతి తెలిసిందే.. ఆ రోజు కేసీఆర్ బీజేపీ తీరును ఎండగట్టేందుకు తన రాజకీయ జీవితంలోనే అతి దారుణమైన భాష వాడారు. మరి అంతగా తిట్టిన తర్వాత.. గట్టిగా పది రోజులు కూడా కాకుండానే మళ్లీ ఎలా వెళ్లి స్వాగతం పలకాలి అనుకున్నారో.. లేదా.. మోడీ వస్తే నేనేంటి వెళ్లడం అనుకున్నారో ఏమో.. మొత్తానికి కేసీఆర్ మోడీ పర్యటనకు డుమ్మా కొట్టారు.
అయితే..ఇలా డుమ్మా కొట్టడం వల్ల కేసీఆర్ సాధించేది ఏముంటుంది.. ఒకవేళ ఇవాళ కేసీఆర్ ప్రోటోకాల్ ప్రకారం ప్రధాని కార్యక్రమానికి వెళ్లినా పెద్దగా వచ్చే ఇబ్బంది ఏముంటుంది.. ఇప్పుడు డుమ్మా కొట్టడం కారణంగా మోదీపై తన ద్వేషాన్ని ప్రపంచానికి చాటి చెప్పినట్టు అయ్యింది. గతంలో బెంగాల్‌లో మమత-మోదీ నిప్పు ఉప్పుగా ఉన్న రోజుల్లో కూడా ప్రధాని మోదీ బెంగాల్‌కు ఏదైనా కార్యక్రమం కోసం వెళ్తే.. మమత స్వయంగా ఆహ్వానించేది.. ఇక్కడ హోదాలు హోదాలే.. రాజకీయం రాజకీయమే కదా.
ఇప్పుడు కేసీఆర్ మోదీ కార్యక్రమానికి హాజరుకాకపోవడం వల్ల ఇదో ఇష్యూగా మారింది.. దీనిపై బీజేపీ, టీఆర్ఎస్‌లు మాటల యుద్ధానికి తెర తీశాయి. ఈ రచ్చ కంటే అసలు కేసీఆర్ అలా వెళ్లి కనిపించి వస్తే ఏ వివాదమూ ఉండేది కాదు.