టార్గెట్‌ 2023: బండి సంజయ్‌ కొత్త ప్లాన్..?

 తెలంగాణలో రాజకీయం క్రమంగా వేడెక్కుతుంది. ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే ఉండటంతో రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే పకడ్బందీ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. తమ ప్రభుత్వ పథకాలు, పాలన తమకు మళ్లీ అధికారం అందిస్తాయన్న భరోసా టీఆర్ఎస్‌లో ఉంటే.. కేసీఆర్ పాలనపై పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందని.. దాన్ని తాము తప్పనిసరిగా ఓట్ల రూపంలోకి మార్చుకుంటామని బీజేపీ భావిస్తోంది. తెలంగాణలో అప్పుడప్పుడు దక్కిన విజయాలు ఆ పార్టీకి ఆశావహంగా మారాయి.

ఇక ఇటీవల తరచూ వార్తల్లో ఉంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇదే సమయంలో టీఆర్ఎస్‌ నుంచి తమ పార్టీలోకి చేరికలు కూడా ఉంటాయని బండి సంజయ్ ఆశిస్తున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వ్యూహం రచిస్తున్న కమల దళం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఓవైపు టీఆర్ఎస్‌ పాలన లోపాలను ఎత్తి చూపడం.. మరోవైపు ఆపరేషన్‌ ఆకర్ష్‌.. ఇలా ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళ్లేందుకు బండి సంజయ్ ప్లాన్ చేస్తున్నారు.

అయితే.. అడపాదడపా తెలంగాణలో విజయాలు దక్కినా..బీజేపీకి అన్ని నియోజక వర్గాల్లో క్యాడర్ ఇప్పటికీ లేరు. కొన్ని చోట్ల పోటీకి అభ్యర్థులు కూడా వెదుక్కోవాల్సిన పరిస్థితి. అందుకే.. ప్రధాన పార్టీల్లోని అసంతృప్తులను పార్టీలో చేర్చుకునే ఆలోచన చేస్తోంది. అందుకే.. ఇత‌ర పార్టీల నుంచి తమ పార్టీలో చేరేందుకు ఎమ్మెల్యేలు  కూడా టచ్‌లో ఉన్నారని బీజేపీ అగ్రనేతలు సంకేతాలు ఇస్తున్నారు.

చేరికల వల్ల బీజేపీ బలపడే మాట వాస్తవమే కానీ.. అడ్డగోలు చేరికలు కూడా పార్టీకి నష్టం చేస్తాయన్న వాదన కూడా ఉంది. ఇటీవల బెంగాల్‌లో ఇదే జరిగిందని.. అందుకే పార్టీలోకి వచ్చేవారిని ఆచి తూచి.. ఎంపిక చేసుకోవాలని బండి సంజయ్ భావిస్తున్నారు. త్వరగా చేరికల పర్వం పూర్తి చేస్తే.. ఆ తర్వాత నియోజక వర్గాల వారీగా వ్యూహాలు రూపొందించుకోవాలని బండి సంజయ్ ఆలోచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: