జగనన్నా.. ఈ ప్రచార రథాలు నీకు అవసరమా..?

పాలకులు తమకు తాము ఎంతో గొప్పగా పాలిస్తున్నామని అనుకుంటారు.. అది సహజం.. అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా అదే అనిపిస్తుంది. అంతే కాదు.. అధికారంలో ఉన్నవారి చుట్టూ భజన పరులు చేరతారు.. అహా మీరు అద్భుతం సార్ అనేవాళ్లే తప్ప.. ఇది బాగాలేదు.. ఇలా ఉంటే మరింత బావుంటుంది అని చెప్పే సాహసం ఎవరూ చేయరు. అయితే.. మరి ప్రభుత్వాలు మంచి పనులు చేసినప్పుడు వాటిని ప్రచారం చేసుకోవడం ఎలా.. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం ఎలా.. ఇప్పుడు జగన్ సర్కారుకు ఇదే ఆలోచన వచ్చినట్టుంది.

అందుకే.. ప్రచార రథాల కాన్సెప్టును బయటకు తెచ్చింది. తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేసేందుకు ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని  జెండా ఊపి ప్రారంభించారు. ఈ ప్రచార రథాలు ఎందుకయ్యా అంటే.. నవరత్నాల వల్ల ప్రయోజనాలు తెలిపేందుకట. పేదలు మరింత ఎక్కువగా సంక్షేమ  పథకాలు వాడుకునేందుకు ఈ ప్రచారం అవసరం అంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.

ప్రభుత్వ పథకాల వల్ల పేదల్లో వస్తోన్న మార్పులను చాలా మంది తెలుసుకోలేక పోతున్నారని.. ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలపై విపక్షాలు  విషప్రచారం చేస్తున్నాయని అందుకే అసలు వాస్తవాలు చెప్పేందుకు ఈ ప్రచార రథాలు అని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ అసలు ఏదైనా ఒక ప్రభుత్వం అద్భుతంగా పాలిస్తే.. ఆ విషయం నలుగురికీ తెలిసేందుకు ప్రచారం అవసరమా.. ‌ప్రభుత్వం ద్వారా  సేవలు అందుకున్నవారు చెప్పే నోటిమాటలే ప్రచారాస్త్రాలుగా పని చేయవా..?

పని చేసే ప్రభుత్వం గురించి మళ్లీ ఒకరు ప్రచారం చేసి చెప్పాలా.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అందుకునేది ఎక్కువగా సామాన్యుడే.. ప్రభుత్వ సేవలు నిజంగా నచ్చితే ఆ  సామాన్యుడే ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ అవుతాడు.. తాను పని గట్టుకుని నలుగురికి ప్రభుత్వం మంచి గురించి చెబుతాడు. ప్రభుత్వ పథకాల అమలులో లోటుపాట్లు లేకుండా చేయగలిగితే చాలు.. సామాన్యుడే మళ్లీ గెలిపిస్తాడు.. ఈ ప్రచారరథాల ఆర్భాటం అనవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: