కేజ్రీవాల్ అలా.. కేసీఆర్ ఇలా.. ఆదాయమే ముఖ్యమా..?

డిసెంబర్ 31 వచ్చేస్తోంది. కొత్త సంవత్సరం మరికొన్నిరోజుల్లో రాబోతోంది. న్యూ ఇయర్ అంటేనే పార్టీల సందడి ఉంటుంది. డిసెంబర్ 31న న్యూఇయర్ పార్టీల సందడి మామూలుగా ఉండదు. అందులోనూ కరోనా సమయంలో వేడుకలే కరవైన సమయంలో ఇప్పుడు తెలంగాణలో ఎలాంటి కట్టుబాట్లు లేని వేళ న్యూఇయర్ పార్టీని బాగా ఎంజాయ్ చేయాలని చాలామంది ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ ప్లానింగ్‌కు తగ్గట్టుగానే కేసీఆర్ ప్రభుత్వం కూడా కొన్ని సడలింపులు ఇచ్చింది.

కొత్త ఏడాది సందర్భంగా మద్యం విక్రయ వేళలు పొడిగిస్తూ కేసీఆర్ సర్కారు తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. 31న అర్ధరాత్రి 12 వరకు మద్యం దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈనెల 31న రాత్రి ఒంటిగంట వరకు బార్లు, పర్యాటక హోటళ్లకు అనుమతులు ఇస్తోంది కేసీఆర్ ప్రభుత్వం.. ఈనెల 31న రాత్రి ఒంటిగంట వరకు ఈవెంట్లకు అనుమతి ఇచ్చింది. ఈవెంట్ల నిర్వహణ కోసం ఆబ్కారీశాఖ తాత్కాలిక లైసెన్సులు జారీ చేస్తుంది.

ఈ తాత్కాలిక లైసెన్సు కోసం ఫీజుగా రూ.50 వేలు నిర్ణయించింది తెలంగాణ ఆబ్కారీ శాఖ.. అయితే మెగా ఈవెంట్లకు ఈ రేటు మరింత ఎక్కువగా ఉండనుంది. ఈవెంట్ల కోసం అత్యధికంగా రూ.2.5 లక్షలు తాత్కాలిక లైసెన్స్‌ ఫీజుగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. ఒమిక్రాన్ కేసులు దేశమంతా పెరుగుతున్న సమయంలో ఇలా న్యూఇయర్ పార్టీలను సమయం పెంచి మరీ ప్రోత్సహించడం ఏంటన్న విమర్శలు పెద్ద ఎత్తువ వస్తున్నాయి.

డిల్లీలో కేసులు కాస్త పెరగ్గానే అక్కడి సీఎం కఠిన చర్యలు తీసుకున్నారని.. న్యూఇయర్ పార్టీలపై నిషేధం విధించారని గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ఆదాయంపైనే దృష్టి పెట్టి ప్రజల ప్రాణాలు గాలికి వదిలేస్తోందంటున్నారు విపక్ష నేత రేవంత్ రెడ్డి. ఇతర రాష్ట్రాలు కోవిడ్ ను అదుపు చేయడానికి రాత్రి పూట కరఫ్యూ విధిస్తుంటే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాత్రి ఒంటి గంట దాకా బార్లకు అనుమతి ఇచ్చిందని విమర్శించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాణాల కంటే ఆదాయమే ముఖ్యమా.. అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: