ఆ దేశంతో ఇండియా స్నేహం.. ప్రపంచానికే మేలు

ప్రపంచంలో అనేక మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. ఈ మార్పులకు తగ్గట్టుగా వ్యూహాలు రూపొందించుకోకపోతే.. కొన్ని దేశాలు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. ఇండియా కూడా ప్రపంచంలోని మార్పులకు తగ్గట్టు విదేశీ విధానం రూపొందించుకుంటోంది. మొదట్లో ఇండియా రష్యాతో సన్నిహితంగా ఉండేది. ఆ తర్వాత కొన్నాళ్లుగా ఇండియా అమెరికాకు ప్రాధాన్యం ఇస్తోంది. ప్రపంచ పెద్దన్న పాత్రలో ఉన్న అమెరికా కూడా ఇండియాకు తగిన ప్రాధాన్యం ఇస్తోంది.

అయితే.. ఇప్పుడు ప్రపంచంపై అమెరికా ప్రభావం, ప్రాభవం కూడా తగ్గుతోంది. చైనా వంటి దేశాలు అమెరికాను అధిగమిస్తున్నాయి. టెక్నాలజీ, మానవ వనరులు ఇప్పుడు అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దీన్ని బట్టి మన విదేశాంగ విధానాన్ని పునర్‌ నిర్వహించుకోవాల్సి వస్తోంది. అందులో భాగంగానే ఇండియా ఇప్పుడు ఆస్ట్రేలియాకు కూడా తగిన ప్రాధాన్యం ఇస్తోంది. ఇండియా, ఆస్ట్రేలియాలకు చాలా పోలికలు ఉన్నాయి. ఆస్ట్రేలియా కూడా ఒకప్పుడు బ్రిటీష్ వాళ్లు పాలించిన దేశమే.

ఇప్పుడు ఆస్ట్రేలియాకూ చైనాకూ కయ్యం నడుస్తోంది. అనేక విషయాల్లో ఆస్ట్రేలియా, చైనా మధ్య విబేధాలు ఉన్నాయి. ఇండియాతో చైనా కయ్యాలు సాగుతున్న సమయంలో శత్రువు శత్రువు మిత్రుడు అన్న నానుడిని ఇండియా నిజం చేస్తోంది. వ్యూహాత్మకంగా ఆస్ట్రేలియాతో స్నేహాన్ని బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా సిడ్నీ డైలాగ్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ప్రసంగించిన ప్రధాని మోడీ.. భారత్-ఆస్ట్రేలియా భాగస్వామ్యం.. ప్రపంచానికే మేలు చేస్తోందని అన్నారు.

నిత్యం మార్పులు జరిగే లోకంలో మనం ఉన్నామన్న ప్రధాని మోడీ.. మన చుట్టూ ఉన్న అన్నింటినీ డిజిటల్ వ్యవస్థ మార్చేస్తోందన్నారు మోడీ. రాజకీయాలు, ఆర్థికం, సమాజాన్ని డిజిటల్ వ్యవస్థ పునర్నిర్వచించింన్న మోదీ.. అన్నిరంగాల్లోనూ ఆస్ట్రేలియాతో కలసి ముందడుగు వేసేందుకు భారత్ సిద్ధమని ప్రకటించారు. ఈ స్నేహం రెండు దేశాలకూ ఉభయ తారకమే. క్వాడ్ దేశాల జాబితాలోనూ ఉన్న ఆస్ట్రేలియాతో స్నేహం రక్షణ పరంగా కూడా ఇండియాకు మేలు చేకూర్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: