జీ ఫర్ గూగుల్ : రెండు మామల ప్రపంచం
ఫస్ట్ కాజ్ : నిన్న రాత్రి ఎఫ్బీ ఆగిపోయాక..
కంటి తెరల మాటు కలలకు వెల్కం.. చెప్పాక...
మనిషిని శాసించే దరిద్రం అంతా టెక్నాలజీలో ఉంటుంది. అవి అడ్డు గోడలు నిర్మిస్తాయి. యుద్ధాలు రేపుతాయి.. అశాంతిని మరి యూ అలజడినీ సృష్టిస్తాయి.. మనుషులు ఇలాంటి దరిద్రాలకు ప్రతినిధులుగా ఉంటూ తమని తాము తిట్టుకుంటారు. అయినా సోషల్ మీడియా చేసిన మేలు, చేయని మేలు ఏంటన్నది నిన్నటి వేళ నిలిచిపోయిన ఏడు గంటల కాలం చెప్పింది. అవును ఆ సర్వర్ల మోరాయింపు ఆ హ్యాకర్ల గొడవో మన జీవితాలను శాసించి పోయాయి.. స్వప్న కాల చింతలు అన్నవి సైతం పెంచి పోయా యి. అవును కంటికి నిద్రను దూరం చేసి దరిద్రగొట్టు కాలాలను డిజిటల్ తెరల దగ్గర కరిగించిపోయిన మనుషులపై ఒకవిధమైన అసహనం పెంచుకునేలా చేసింది సోషల్ మీడియానే!
అయినా మనిషి మారడు ఆతని వాంఛ తీరదు.... :
మనుషులు ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకోవడం అటుంచి స్టేటస్ కబుర్లపై దృష్టి నిలిపి చాలా కాలమైంది. ఏదయినా పెరిగి విరగాలి.. రాత్రి జరిగింది కాస్త ముందస్తు హెచ్చరిక. చావో, బతుకో సోషల్ మీడియాలోనే అన్న విధంగా ఉన్న కాలాలను, మనుషులను చూసి నవ్వుకుంటాను. ఓ దరిద్రగొట్టు వ్యవస్థలో అంతగా లీనం కావడం ఎంత భయమో అర్థం కాదే వీళ్లకు.. ఒకప్పుడు హాయిగా చదివేందుకు పుస్తకాలు అందుబాటులో ఉండేవి.. చదివే శక్తి పోయి వినేశక్తి ఈ మనుషులకు వచ్చేసింది అని సోషల్ మీడియా పుణ్యమాని అనుకోనవసరం లేదు.. వినే శక్తి వినిపించుకునే శక్తి కూడా పోయి కళ్లను డిజిటల్ తెరల రేడిషన్లకు బానిస చేయడమే అలవాటుగా మారింది ఈ కాలం మనుషులకు.. కనుక పుస్తకం చచ్చిపోయింది.. విలువలు చచ్చిపోయాయి.. ఇంకా చదివే గుణం, చదివించే గుణం ఈ రెండూ చచ్చి చాలా కాలం అయ్యాయి. అయినా మనిషి మారడు ఆతని వాంఛ తీరదు....
మంచి వాహకమే కానీ
ప్రమాదకారి కూడా!
చందమామ కథలు లేవు..ప్రింట్ ఫార్మెట్ లో .. డిజిటల్ యుగం వచ్చాక చాలా మంది చచ్చిపోయారు. చాలా మంది చచ్చి బతికారు. బతికిన వాళ్లంతా చావు నుంచి ఎలా తప్పించుకున్నామో చెప్పుకుని ఆనందపడుతున్నారు. బతుకును జీవన్మరణ సమస్యలా మార్చిన సోషల్ మీడియా దరిద్రం కొన్ని సార్లు మనిషిని వేధిస్తోంది. కొన్ని చావులకూ అదే కారణం అవుతోంది. అయినా అన్నింటా మంచిని వెతికి చెడును వదిలిపోవాలి కనుక కొన్ని విషయాల్లో పారదర్శకతను పెంచింది, చెప్పాలనుకున్న నాలుగు మాటలనూ చెప్పేలా చేసింది కూడా సోషల్ మీడియానే! ఇప్పుడు రెండు మామలు.. మాటలు రాని మామ వెలుగుల మామ చందమామ, మాటలు నేర్పే మామా మాటలతో యుద్ధాలు నడిపించే మామ జూకర్ మామ.. అందుకే రెండు మామ ప్రపంచం అని అన్నాను. మాయా ప్రపంచం అని కూడా అనాలి. మనిషికి కన్నీటి తెరలు అడ్డుగా ఉంటాయి. మాయా పొరలు అడ్డుగా ఉంటాయి..వేటిని ఛేదించాలి..వేటితో విభేదించాలి అన్న స్పృహ లేదా ఇంగితం లేని మనుషులకు ఈ డిజిటల్ మీడియా ఓ దరిద్రం. లేదా అదే ఒక పెద్ద నేర మయ ప్రపంచానికి సంకేతిక కూడా! అలా కాకుండా ఆలోచిస్తే..కొంత విజ్ఞానం, వికాసం, సమాచారం అన్నవి అందించే క్రమంలో ఇదొక మంచి వాహకం.
అలసటలు తొలగవు
అలజడులు ఆగవు...
ప్రపంచం ఆగిపోయిన ప్రతిసారి మనిషి మేల్కొంటాడు. మెదడు తిరుగుబాటు చేసిన ప్రతిసారీ టెక్నాలజీ మేల్కొంటుంది. టెక్నాలజీ తిరుగుబాటు చేసిన ప్రతిసారి మొరాయింపుల సన్నాయి నొక్కుల్లో కొత్త స్వరం ఒకటి ఊపందుకుని ప్రత్యామ్నాయ దారిని ఒకటి వెతుక్కుని ఉంటుంది. సాంకేతికత అన్నది నిరంతరం పరిణామం చెందే క్రమానికి దగ్గర లేదా అందుకు సంబంధించిన దారి ఒకటి నిరంతరం కొత్త ప్రాతిపదికల మేళవింపు. మనిషి ఓడిపోవడం అన్నది జరిగినా, జరగకున్నా టెక్నాలజీ గెలుపు అన్నది నిరంతరం సాధ్యం కాని పని. మెదడు అలసటలనూ నిర్విరామ చర్యలనూ టెక్నాలజీ ఇవాళ నియంత్రిస్తోంది. కొన్ని సార్లు అలసటలను పెంచుతుంది కూడా!
కొద్దిశాతం మంచి అధికం చెడు..
నిందించాల్సిందే..తప్పుకోవాల్సిందే!
ఇవాళ ప్రపంచం కొత్త ప్రతిపాదనలు ప్రేమిస్తూ, వాటి అన్వేషణ వెనుక ఉన్న కృషిని సైతం గుర్తించి గౌరవిస్తోంది. చాలా ఏళ్ల కిందట నాకు సోషల్ మీడియా వద్దు అదొక దరిద్రం అనుకున్న వారంతా ఇప్పుడు ఇటుగా రాక తప్పని సరి పరిస్థితి.. ఈ సిలికాన్ చిప్పుల గోలలో టెలిఫోన్ ధ్వనులు మూగబోయి కొత్త రకం ధ్వనుల అప్రమత్తత అన్నది మనకు వినిపిస్తూ ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా అకౌంట్ లేకపోతే అపచారం. నిజంగా వాడొక అన్ సివిలియన్.. అవును అనాగరికం అన్న పదాన్ని వాడకూడదో వాడవచ్చా తెలియదు కానీ లేత మనసులకు కూడా సోషల్ మీడియానే ఆధారం. ఇంత దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుని ప్రయాణం చేయడం తప్పే అయినా మనకు తప్పదు. జూకర్ మామకు థాంక్స్ చెప్పను ఏమయినా సరే! ఇలాంటి ఒక అనారోగ్యకారకాలను నెత్తిన పెట్టిన టెక్నాలజీకి థాంక్స్ చెప్పను గాక చెప్పను.. ఇవి అమవాస చీకట్లు.. ఇలానే ఉండాలి ఉంటాయి కూడా! ఈ గుడ్డిత నం పోదు కొత్త వెలుగు రాదు. కొద్దిపాటి మంచి కారణంగా అధిక శాతం చెడును నిందించకుండా ఉండడం కూడా ఓ ప్రమాదకరం.
- రత్నకిశోర్ శంభుమహంతి