డ్రగ్స్‌ కేసు.. బాలీవుడ్, టాలీవుడ్‌.. ఎంత తేడా..?

ముంబయిలోని డ్రగ్స్ కేసు విచారణ కలకలం సృష్టిస్తోంది. ఏకంగా బాలీవుడ్ సూపర్ స్టార్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ను జైలు ఊచల వెనక్కి పంపారు. ఆయనతోపాటు మరో ఇద్దరు సెలబ్రెటీల పిల్లలను కూడా అరెస్టు చేశారు. ఆర్యన్‌ ఖాన్‌కు కోర్టులోనూ చుక్కెదురైంది. బెయిల్‌  పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఆర్యన్‌, అర్బాజ్‌ మర్చంట్‌, మూన్‌మూన్లను ఎన్సీబీ కస్టడీకి తీసుకుంది. అంతేకాదు.. ఆర్యన్‌ఖాన్‌కు డ్రగ్స్‌ సరఫరా చేశారన్న ఆరోపణలతో శ్రేయస్‌ నాయర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

అయితే.. ఇదే సమయంలో బాలీవుడ్ డ్రగ్స్ కేసు.. టాలీవుడ్ డ్రగ్స్‌ కేసును గుర్తు చేస్తోంది. ఇక్కడ కూడా దాదాపు నాలుగేళ్ల క్రితమే డ్రగ్స్ రాకెట్ బట్టబయలైంది. అనేక మంది నటీనటులను విచారణకు పిలిచారు. ఆ తర్వాత కేసు హఠాత్తుగా సైడ్ అయ్యింది. ఆ కేసు విచారణ చేస్తున్న ఐపీఎస్‌లను కూడా ఇతర శాఖలకు బదిలీ చేశారు. ఆ తర్వాత దాదాపు కేసు క్లోజయినట్టేనని అంతా అనుకున్నారు. అయితే మళ్లీ రేవంత్ రెడ్డి వంటి వాళ్లు కోర్టును ఆశ్రయించడంతో కేసు మళ్లీ వెలుగులోకి వచ్చింది.

ఏకంగా ఈడీ, సీబీఐ వంటి సంస్థలు టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణకు తెలంగాణ సర్కారు సహకరించట్లేదని చెప్పాయని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు కూడా. ఏదేమైనా టాలీవుడ్ డ్రగ్స్ మాత్రం పెద్దగా ముందుకు వెళ్లడం లేదు. ఈడీ విచారణతోనైనా కేసు చిక్కుముడి వీడుతుందని భావిస్తే.. ఈ విచారణలోనూ క్లీచ్ చిట్ ఇస్తారనే సూచనలు కనిపిస్తున్నాయి. అక్కడ బాలీవుడ్‌లో మాత్రం ఏకంగా షారూక్ ఖాన్ కొడుకును కూడా ఊచల వెనక్కిపంపి.. పకడ్బందీగా విచారణ సాగిస్తున్నారు.

మరి టాలీవుడ్ కేసు విచారణ ఎందుకు నత్తనడకన సాగుతోంది. నిజంగానే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న టాలీవుడ్ నటులంతా అమాయకులేనా.. కాకపోతే.. చర్యలు తీసుకోవడంలో ఇంత ఆలస్యం ఎందుకు.. ఇప్పటి వరకూ కనీసం ఒక్కరిని కూడా అరెస్టు చేయలేకపోయారెందుకు.. దర్యాప్తు అధికారులకు స్వేచ్ఛ లేకపోవడమే ఇందుకు కారణమా.. ఇవీ ఇప్పుడు బాలీవుడ్ కేసు చూశాక వస్తున్న ప్రశ్నలు. సమాధానాలు మాత్రం దొరకట్లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: