మమ్మల్ని గుర్తించాలంటున్న తాలిబన్లు

మమ్మల్ని గుర్తించాలంటున్న తాలిబన్లు  
ఆఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వాన్ని కూల్చి వేసి అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబన్లు తమను గుర్తించాలని ఆంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలను వేదికగా చేసుకున్నారు. తమకు అనుకూలంగా ఉన్న దేశాల ద్వారా తమ వాణిని వినిపించే యత్నం చేశారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న ప్రపంచ దేశాలు తాలిబన్ల ప్రయత్నాలకు బ్రేక్ వేశాయి. ఒక అంతర్జాతీయ సదస్సును వాయిదా వేయడం ద్వారా ప్రపంచ దేశాలు తాలిబన్లకు తమ నిర్ణయాన్ని చెప్పకనే చెప్పాయి.
వాయిదా పడిన సార్క్ సమావేశం
 ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలలో భాగంగా ఏటా  సార్క్ దేశాల విదేశీ వ్యవహారాల శాఖ మంత్రుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశాలు  శనివారం నుంచి అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఆరంభం కావల్సి ఉంది. పలు అంశాలను చర్చించాల్సి ఉంది.  సార్క్ విదేశాంగ మంత్రుల సమావేశానికి సంబంధించిన అజెండా కూడా కొద్ది నెలల క్రితమే తయారైంది.
అయితే సార్క్ సమావేశానికి తాలిబన్లను ఆహ్వానించాలి పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది. ఈ ప్రతి పాదనను సార్క్ సభ్యదేశాలు వ్యతిరేకించాయి. ఈ అభ్యంతరాలను త్రోసిపుచ్చిన పాకిస్తాన్ తాలిబన్లను సార్క్ విదేశాంక మంత్రుల సమావేశానికి ఆహ్వానించాల్సిందేనని పట్టుబట్టింది.  దీంతో పలు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సార్క్ సదస్సు రద్దయింది.
ఆఫ్ధనిస్తాన్ లో తాలిబన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని భారత దేశెంతో సహా ఏ ఇతర దేశమూ ఇంత వరకూ గుర్తించ లేదు. పైగా ఆ దేశంలో జరుగుతున్న పరిణామాలపై వివిధ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. అంతేకాక తాలిబన్ ప్రభుత్వంలో ని కొందరు నేతలపై ఐక్యరాజ్యసమితి ఇదివరకే నిషేధం విధించి ఉంది. దక్షిణాసియా దేశాల  ప్రాంతీయ సహకార సంఘం ( సార్క్)లో భారత దేశంతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్,  నేపాల్, శ్రీలంక, మాల్దీవులు, ఆఫ్ఘనిస్తాన్, బూటాన్ లు సభ్యులుగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ లో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ఈ దఫా సార్క్ సదస్సుకు ఆ దేశానికి  పిలుపు రాలేదు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్లు తమను గుర్తించాలంటూ అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేశారు. పాకిస్తాన్ ను పావుగా ఉపయోగించుకునే యత్నం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: