వైసీపీ టాప్ లీడ‌ర్ త‌న‌యుడి పొలిటిక‌ల్ పాట్లు... ?

RAMAKRISHNA S.S.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఆముదాలవలస నియోజకవర్గం ఎన్నో రాజకీయ పరిణామాలకు వేదికగా నిలిచింది. ముఖ్యంగా తమ్మినేని కుటుంబం ఇక్కడి రాజకీయాల్లో చాలాకాలంగా కీలకంగా వ్యవహరిస్తోంది. మాజీ స్పీకర్ మరియు మాజీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం అనేక ఎన్నికలలో విజయాలు, ఓటములను ఎదుర్కొంటూ నేటికీ సీనియ‌ర్‌ రాజకీయ నాయకుడిగా నిలిచారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడం, వయస్సు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో త‌న వార‌సుడిని ముందుకు తీసుకురావాలన్న ఆలోచన త‌మ్మినేని కుటుంబంలో.. ఇటు వైసీపీ వర్గాలలో తెర‌మీద‌కు వ‌స్తోంది. ఈ సమీకరణల మధ్య తమ్మినేని సీతారాం కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్ పేరు తెరపైకి వచ్చింది. రాజకీయంగా వారసత్వం అనేది మ‌న‌దేశ‌ ఎన్నికల వ్యవస్థలో కొత్తదికాదు. గత ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, బీజేపీ పార్టీలలో అనేక వారసులు తమ తండ్రుల స్థానాలు లేదా వారసత్వం ఉన్న స్థానాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు.


శ్రీకాళహస్తి, నగరి, మంగళగిరి వంటి నియోజకవర్గాలు ఇందుకు స్పష్టమైన ఉదాహరణలు. అందువల్ల, వచ్చే ఎన్నికల్లోనూ రాజకీయ వారసులు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందనే విశ్లేషకుల అభిప్రాయం. ఆముదాలవలసలో కూడా అలాంటి రాజకీయ వారసత్వ ప్రయోగం ప్రారంభమయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటికే చిరంజీవి నాగ్ తన రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించిన సంకేతాలను ఇస్తున్నారు. మీడియాను ఇంటికి పిలిచి సరాసరి ఇంటర్వ్యూలు ఇవ్వడం, యూట్యూబ్ ఛానళ్ళకు ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డం, డిజిటల్ ప్రమోషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం వంటి కార్యక్రమాలు ఆయన చేసే ప్రయత్నాల్లో భాగమే. అయితే, ఈ రకమైన ప్రమోషన్ వ్యక్తిగత ఇమేజ్‌కు ఎంత మేరకు దోహదపడుతుందనే విషయంలో రాజకీయ నిపుణుల అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి.


నేటి కాలంలో యువతను ఆకర్షించడంలో సోషల్ మీడియా ప్రాధాన్యం ఎంతో ఉన్నా ప్ర‌త్య‌క్షంగా ప్ర‌జ‌ల్లో ప‌ట్టుసాధించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు. అయితే నాగ్ ప్ర‌త్య‌క్షంగా ప్ర‌జ‌ల‌తో కాంటాక్ట్ కావ‌డం లేద‌న్న చ‌ర్చ‌లు ఉన్నాయి. మరోవైపు వైసీపీ అంతర్గత లెక్కలు కూడా ఈ నియోజకవర్గ భవిష్యత్తుపై కీలక ప్రభావం చూపుతున్నాయి. తమ్మినేని సీతారాం పోటీ చేయలేని పరిస్థితి వస్తే, చిరంజీవి నాగ్‌కు టికెట్ ఇవ్వడం పార్టీకూ వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందా అనే ఆలోచన జరుగుతోంది. పార్టీ వర్గాలు ఆయనకు స‌రైన‌ మార్గదర్శనం చేస్తే, జనాల్లో తిరిగి పట్టు సాధించడంలో సహాయపడే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రత్యామ్నాయ అభ్యర్థుల ఎంపిక గురించిన చర్చ కూడా నేపథ్యంలో నడుస్తున్నట్లు సమాచారం. మొత్తానికి, ఆముదాలవలస ఎన్నికలు ఈసారి ఆసక్తికరంగా మారాయి. రాజకీయ వారసత్వం లోకంలో తమ్మినేని చిరంజీవి నాగ్ ఎంత మేరకు జనాన్ని ఆకర్షించగలరు ?  తండ్రి వార‌స‌త్వాన్ని ఎలా నిల‌బెడ‌తాడు ? అన్న‌దే ఆస‌క్తిక‌రం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: