రూపానీ రాజీనామా వెనుక ఇంత రాజకీయమా..!

అసలు గుజరాత్‌లో ఏం జరుగుతోంది... సరిగ్గా ఎన్నికల ముందు ముఖ్యమంత్రి పదవికి విజయ్ రూపానీ ఎందుకు రాజీనామా చేశారు. ఎన్నికలకు ఎవరు సారధ్యం వహిస్తారు...  అసలు బీజేపీ ప్లానింగ్ ఏమిటీ... ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్... సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి పదవికి విజయ్ రూపానీ రాజీనామా చేశారు. ఆయన బాటలోనే మంత్రివర్గం కూడా వెనక్కి తగ్గాలని హైకమాండ్ కూడా ఆదేశించింది.

ఆపరేషన్ గాంధీనగర్... ఇప్పటికే ఈ పేరు మారు మోగిపోతోంది. బీజేపీ జనరల్ సెక్రటరీ, కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌తో పాటు బీఎల్ సంతోష్ మొత్తం వ్యవహారం నడిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతలూ కూడా గుజరాత్‌లోని బీజేపీ ఎమ్మెల్యేలను స్వయంగా కలుస్తున్నారు. తాజా మాజీ సీఎం విజయ్ రూపానీతో సంతోష్ భేటీ అయ్యారు. ఆ తర్వాత కొద్ది సేపటికే పదవికి రాజీనామా చేస్తున్నట్లు రూపానీ ప్రకటించారు. ఇటీవల కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్ షా పర్యటనలో కూడా  ఇదే విషయంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

కరోనా సెకండ్ వేవ్ సమయంలో రూపానీ నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది ప్రతిపక్షాల ఆరోపణ. ఇదే విషయంపై ప్రధాని మోదీ కూడా కాస్త కోపంగానే ఉన్నారని... అందుకే రూపానీని ఇప్పుడు పదవి నుంచి తొలగించారనేది పార్టీ నేతల మాట. అమిత్ షాకు అత్యంత ఆప్తుడుగా పేరున్న విజయ్ రూపానీ... 2016లో సీఎం పదవి దక్కించుకున్నారు. గతేడాది మే నెలలో రాష్ట్రంలో మరణాల సంఖ్య అహ్మదాబాద్ హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఒక దశలో రూపానీ పరిపాలనను తీవ్రంగా తప్పుబట్టింది హైకోర్టు. ఇదే విషయంపై అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం రేగింది. మహమ్మారిని నియంత్రించడంలో రూపానీ సర్కార్ పూర్తిగా విఫలమైందని... ఇదే విషయంపై షా కూడా హెచ్చరించినట్లు పార్టీ నేతలు వెల్లడించారు.

గుజరాత్‌ పరిపాలనపై రూపానీ పట్టు సాధించలేకపోయారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సీనియర్ అధికారులతో పాటు పార్టీ నేతలు కూడా ఆయనతో అనుకూలంగా లేరు. అటు గతంలో గుజరాత్‌లో ముఖ్యమంత్రులుగా ఉన్న ప్రధాని మోదీతో పాటు ముగ్గురు ముఖ్యమంత్రులతో కూడా పోలుస్తున్నారు. ప్రస్తుత ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న ఆనందీబెన్ పటేల్ నుంచి రూపానీ బాధ్యతలు స్వీకరించారు. అయితే పటేల్‌ను బలవంతంగా రాజీనామా చేయించారనే... ఈ విషయంలో అమిత్ షా కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే రూపానీ కుటుంబం పరిపాలనలో జోక్యం చేసుకోవడం... విజయ్ రూపానీ భార్య అంజలి రూపానీ... అధికారులను నేరుగా ఇంటికే పిలిపించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక దశలో అంజలి రూపానీ సూపర్ సీఎం అంటూ పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. అలాగే పార్టీ గుజరాత్ శాఖ అధ్యక్షుడు సీఆర్ పాటిల్‌తో ఏ మాత్రం సఖ్యత లేకపోవడం కూడా రూపానీ రాజీనామాకు కారణంగా తెలుస్తోంది.

రూపానీ పరిపాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు ఇప్పటికే చాలా సర్వేలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రూపానీ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లడం కొంత ఇబ్బందిగానే ఉంటుందని  బీజేపీ అగ్రనేతలు భావించినట్లు తెలుస్తోంది. రూపానీపై వ్యతిరేకత తగ్గించి... గుజరాత్‌లో తిరిగి పగ్గాలు చేపట్టాలంటే మాత్రం... అక్కడ కొత్త నేతలు కనిపించాలనేది బీజేపీ భావన. రూపానీ తర్వాత సీఎం పదవి రేసులో ప్రధాని మోదీకి అత్యంత నమ్మకమైన వ్యక్తిగా గుర్తింపున్న కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా పేరు బలంగా వినిపిస్తోంది. అయితే ప్రస్తుతం థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రిని మార్చడం సరైంది కాదనే అంశం కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

2017లో జరిగిన గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు గెలుచుకుని... వరుసగా ఆరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ కూడా 77 సీట్లతో బలమైన ప్రత్యర్థిగానే నిలిచింది. అక్కడి ఓటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మోదీ... వరుస పర్యటనలతో పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఎంతో కృషి చేశారు. ఇదే సమయంలో అంతర్గత విభేదాలతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసాన్నీ కోల్పోయింది. ప్రస్తుతం గుజరాత్ కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందో కూడా తెలియటం లేదు.

ఎన్నికలపైనే ప్రధానంగా దృష్టి సారించిన మోదీ-షా ద్వయం... ఇందుకోసం ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రులను మార్చేందుకు కూడా ఏ మాత్రం సంశయించడం లేదు. ఈ ఏడాదిలోనే ఆరు నెలల్లో నలుగురు ముఖ్యమంత్రులను మార్చి... కొత్త వారిని నియమించారు. టార్గెట్ అసెంబ్లీ ఎలక్షన్‌గా మోదీ-షా ద్వయం అడుగులు వేస్తోందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: