ఆరు నెలల్లో నలుగురు సీఎంలు అవుట్..!

భారతీయ జనతా పార్టీకీ ఏమైంది...? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అవును నిజంగా బీజేపీకి ఏమైంది. కేంద్రంలో పూర్తి స్థాయి మెజారిటీతో అధికారంలో ఉన్న కమలం పార్టీ దేశంలో తమకు ఎదురే లేనట్లుగా వ్యవహరిస్తోంది. పార్లమెంట్‌లో కేవలం రెండంటే రెండే స్థానాలతో మొదలైన్ కాషాయా పార్టీ... నేడు ఏకంగా 300 పై చిలుకు ఎంపీ స్థానాలతో తిరుగులేని శక్తిగా ఎదిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ హవాకు గండి కొడుతూ...  దేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కుంచుకుంది. కొన్నిరాష్ట్రాల్లో అయితే బీజేపీకి ప్రత్యామ్నాయమే లేదన్నట్లుగా సాగుతోంది. అలాంటి భారతీయ జనతా పార్టీకి కొద్ది రోజులుగా ఇబ్బందులు పడుతోందనే చెప్పాలి. అవును నిజమే... ఇందుకు గత ఆరు నెలల కాలాన్ని తీసుకుంటే సరిపోతుంది. కాషాయ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆరు నెలల్లో ఏకంగా నలుగురు ముఖ్యమంత్రులు రాజీనామా చేశారు.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా త్రివేంద్ర సింగ్ రావంత్‌ రాజీనామాతో మొదలైన ఈ ప్రక్రియ ప్రస్తుతం గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వరకు కొనసాగింది. నాలుగేళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగిన త్రివేంద్ర సింగ్ రావంత్... అధిష్టానం ఆదేశంతో ఈ ఏడాది మార్చి పదవ తేదీన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కొత్త సీఎంగా తిరత్ సింగ్ రావంత్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. అయితే ఆయన కూడా ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. సరిగ్గా 116 రోజులే సీఎం కుర్చీలో కూర్చున్న తిరత్ సింగ్ రావంత్... అనూహ్యంగా రాజీనామా చేశారు. ఆ వెంటనే పుష్కర్ సింగ్ ధామి అధిష్ఠానం ఆదేశాలతో ఆ పదవి చేపట్టారు. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. సరిగ్గా కొవిడ్ సమయంలో ఈ మార్పులు జరగడంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి కూడా.
ఆ తర్వాత ఏ సమస్యలు లేకుండా సాగిపోతందని అంతా అనుకున్న కర్ణాటకలోని బీఎస్ యడియూరప్ప సర్కార్‌లో పెను దుమారం లేచింది. యడ్డీ తీరును వ్యతిరేకిస్తూ... పలువురు మంత్రులు అసమ్మతి కూటమిగా తయారయ్యారు. యడ్డీని తొలగించాలని... లేదంటే తామే తొలగిపోతామంటూ అధిష్ఠానానికి అల్టిమేటం కూడా ఇచ్చారు. ఏకంగా 20 రోజుల పాటు ఈ డ్రామా కొనసాగింది. ఇదే సమయంలో ఆగ మేఘాల మీద ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిసిన యడ్డీ మాత్రం... అలాంటిది ఏమీ లేదని... తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతా అంటూ హస్తినలో ప్రకటించారు. కేవలం రాష్ట్ర సమస్యలపై మాత్రమే చర్చించానంటూ సన్నాయి నొక్కులు కూడా నొక్కారు. తీరా సీన్ కట్ చేస్తే... ఆయన పదవి చేపట్టి రెండేళ్లు పూరైన జులై 26వ తేదీనే ముఖ్యమంత్రి పదవికి చాలా బాధతో రాజీనామా కూడా చేశారు. ఆయన స్థానంలో రెండు రోజులకు బసవరాజ్ బొమ్మై ప్రమాణ స్వీకారం చేశారు.
తాజాగా నాలుగేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ... హడావుడిగా గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌కు తన రాజీనామా లేఖ అందించారు రూపానీ. అసలేమైందో తెలియక పార్టీ నేతలే తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆయన తర్వాత కొత్త సీఎం రేసులో ఏకంగా నలుగురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఇద్దరు కేంద్ర మంత్రులు పురుషోత్తమ్ రూపాలా, మన్సుక్ మాండవీయ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్‌ కూడా రాజీనామా చేస్తారనే ఊహాగానాలు బలంగా వినిపించాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు యోగీపై అధిష్ఠానానికి చాలా ఫిర్యాదులు చేశారు. అయితే ఆగమేఘాల మీద రంగంలోకి దిగిన బీజేపీ పెద్దలు పరిస్థితి సద్దుమణిగేలా చర్యలు చేపట్టారు. రాజీ ప్రయత్నాలు ఫలించడంతో యోగీ రాజీనామా వాయిదా పడింది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్న సీఎంలపై ఉన్న అసంతృప్తి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కొత్త సీఎంలను నియమిస్తున్నారని... వారి ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్లేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనేది రాజకీయ విశ్లేషకుల మాట. చూడాలి మరి... బీజేపీ లెక్కలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP

సంబంధిత వార్తలు: