తాలిబాన్లకు పంజ్ షీర్ తలవంచిందా?

Mekala Yellaiah
తాలిబాన్లకు కొరకరాని కొయ్యగా మారిన పంజ్ షీర్ ఇప్పుడు వారికి తలవంచిందా? ఆ ప్రాంతాన్ని పూర్తిగా తాము ఆధీనంలోకి తీసుకున్నామని తాలిబాన్లు ప్రకటించారు. అయితే తాము లొంగిపోయే ప్రసక్తే లేదని, తాలిబాన్లపై పోరాటాన్ని కొనసాగిస్తున్నామని నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ అఫ్గానిస్తాన్(ఎన్ఆర్ఎఫ్) అంటోంది. కాబుల్ సహా  దేశాన్నంతా ఆక్రమించుకున్నా, పంజ్ షీర్ ను వశపరచుకోవడం తాలిబాన్ల తరం కావడంలేదు. పంజ్ షీర్ లోయపై పట్టు సాధించేందుకు తాలిబాన్లు కొద్ది రోజుల నుంచి తీవ్రంగా పోరాడుతున్నారు. ఎన్ఆర్ఎఫ్ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవుతోంది. దీంతో అక్కడ భీకరమైన పోరాటం సాగుతోంది. 

ఈ పోరాటంలో పంజ్ షీర్ ను లొంగదీసుకున్నామని, ఇక అఫ్గానిస్తాన్ యుద్ధం నుంచి పూర్తిగా బయటపడిందని తాలిబాన్లు ప్రకటించుకున్నారు. అల్లా దయతో అఫ్గానిస్తాన్ మొత్తం తమ ఆధీనంలో ఉందని, పంజ్ షీర్ లో సమస్యలు సృష్టిస్తున్న వారు ఓడిపోయారన్నారు. అయితే ఇది వాస్తవం కాదని, పంజ్ షీర్ ను తాలిబాన్లు ఎప్పటికీ గెలవలేరని ఎన్ఆర్ఎఫ్ అధికార ప్రతినిధి అలీమైసమ్ ప్రకటించారు. పంజ్ షీర్ వ్యాలీ ఎప్పటికీ తమదే అన్నారు. తాలిబాన్లు తమను లొంగదీసుకునేందుకు కరెంట్, ఇంటర్నెట్, టెలిఫోన్ సౌకర్యాలను లేకుండా చేశారని, అయినా పోరాడుతున్నామన్నారు. రెండు వర్గాలు ప్రకటించుకోవడంతో ఏది నిజమో, ఏది అవాస్తవమో తెలియడంలేదు. 

కాబుల్ నగరానికి ఉత్తరాన ఉన్న పంజ్ షీర్ అఫ్గానిస్తాన్ లో అతి చిన్న రాష్ట్రంగా ఉంది. తాలిబాన్ల వ్యతిరేక పోరాట యోధులకు నిలయమైన పంజ్ షీర్ లోయలో సుమారు రెండు లక్షల మంది నివసిస్తున్నారు. ఎత్తుగా ఉన్న పర్వత శిఖరాలకు వెనుక ఈ లోయ ఉంది. గిరిజన నాయకుడు అహ్మద్ మసూద్ తాలిబాన్ల వ్యతిరేక దళానికి నాయకత్వం వహిస్తున్నారు. స్థానిక మిలీషియా సభ్యులు, అఫ్గానిస్తాన్ మాజీ భద్రతా సిబ్బంది ఈ దళంలో సభ్యులుగా ఉన్నారు. గతంలో సోవియట్ రష్యా సేనలు, తాలిబాన్లు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోకుండా అహ్మద్ మసూద్ తండ్రి వీరోచితంగా పోరాడారు. ఈ ప్రాంతంపై తాలిబాన్లు పట్టు సాధించలేకపోతున్నారు. అయితే తాలిబాన్లు పంజ్ షీర్ ను ఆక్రమించుకుంటారా, లేదా అనేది ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: