జగన్, కేసీఆర్ వాటర్ వార్‌.. మరో కుట్రకు కర్ణాటక సీఎం ప్లాన్‌?

కృష్ణా జలాల కోసం ఏపీ, తెలంగాణ కొన్నాళ్లుగా కొట్టుకుంటున్నాయి.. కోర్టుల్లో కేసులు వేసుకుంటున్నాయి. ఎన్జీటీలో కేసులు వేసుకుంటున్నాయి. కృష్ణా బోర్డు, గోదావరి బోర్డులకు ఫిర్యాదులు చేసుకుంటున్నాయి.. అంతేనా.. ఇదే విషయంలో కేంద్రానికి లేఖల మీద లేఖలు రాసుకుంటున్నాయి. మరోవైపు ట్రైబ్యునళ్లలోనూ కేసులు కొనసాగుతున్నాయి.. ఏపీ సీఎంగా జగన్ ఎన్నికైన తొలిరోజుల్లో కేసీఆర్, జగన్ ఇద్దరూ కలసిమెలసి జల వివాదాలు పరిష్కరించుకోవాలని అనుకున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి కూడా జగన్ వచ్చారు. ఆ తర్వాత ఎక్కడ చెడిందో కానీ.. ఇద్దరు సీఎంలూ సైలంట్ అయ్యారు. గోదావరి జలాలపై రెండు రాష్ట్రాలకూ మొదటి నుంచి పెద్దగా పేచీ లేదు. కానీ.. ఉన్న గొడవంతా కృష్ణాజలాల విషయంలోనే.. ఎందుకంటే.. గోదావరిలో పుష్కలంగా నీరు ఉంటుంది. కానీ కృష్ణాజలాలు మనదాకా వచ్చేదే తక్కువ. అందువల్ల ఆ నీటి కోసం రెండు రాష్ట్రాలూ గొడవపడుతుంటాయి. రాయలసీమ కోసం పోతిరెడ్డిపాడు నుంచి మరిన్ని నీళ్లు తీసుకెళ్లేందుకు జగన్ రాయలసీమ ఎత్తిపోతల కడుతున్నాడు. దీన్ని టీఆర్ఎస్‌ సర్కారు వ్యతిరేకిస్తోంది.

ఇలా ఏపీ తెలంగాణ కృష్ణా జలాల కోసం కొట్టుకుంటుంటే మరోవైపు కర్ణాటక మరో కుట్రకు తెర తీస్తోంది. ఇప్పటికే ఆలమట్టి డ్యామ్ ద్వారా కృష్ణా జలాలు రాకుండా అడ్డుకుంటుంటే.. ఇప్పుడు ఆ ఆలమట్టి డ్యామ్ ఎత్తును మరింత పెంచాలని ప్లాన్ చేస్తోంది. కర్ణాటక కొత్త సీఎం బొమ్మై ఇప్పుడు ఈ విషయంపై దృష్టి పెట్టారు. ఆలమట్టి జలాశయం ఎత్తును 524 మీటర్లకు పెంచడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయంపై నిపుణులతో చర్చిస్తున్నట్లు కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై ప్రకటించారు.

ఆలమట్టి జలాశయం ఎత్తు ఇప్పుడు 519 మీటర్లుగా ఉంది.  దీన్ని 524 మీటర్లకు పెంచాలన్నది కర్ణాటక ప్లాన్. ఇదే జరిగితే.. ఏపీ, తెలంగాణ రైతుల నోట్లో మట్టి ఖాయం. కేసీఆర్, జగన్ ముందు దీనిపై దృష్టి సారించి.. ఆ కుట్రను ఆపాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: