చంద్రబాబు ఎందుకు ఓడిపోయాడో చెప్పేసిన ఆర్కే..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయి రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఏపీకి తొలి సీఎంగా చంద్రబాబుకు అవకాశం వచ్చింది. ఆయన అధ్భుత రాజధాని అమరావతి నిర్మిస్తానంటూ కలల ప్రపంచం చూపించారు. కానీ.. అది వాస్తవరూపం దాల్చలేదు. దాదాపు పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు... మళ్లీ ఐదేళ్లకే అధికారంలో కోల్పోయారు. అయితే.. ఎక్కువగా తెలుగు దేశాన్ని వెనకేసుకొస్తారని పేరున్న ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ.. తన తాజా కొత్త పలుకు వ్యాసంలో చంద్రబాబు ఎందుకు ఓడిపోయారో రాసుకొచ్చారు.

నాయకులు తమ తప్పులు చెప్పేవారిని దగ్గరకు రానీయకపోవడం వల్ల.. తమ పాలనలోని  తప్పొప్పులు తెలుసుకునే అవకాశం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఏ నాయకుడైనా, ఏ పార్టీ అయినా బలంగానే కనపడతారని.. ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్ల క్రితం వరకు అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు ఇందుకు తాజా ఉదాహరణ అని రాధాకృష్ణ ప్రస్తావించారు. చంద్రబాబు కూడా అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను కలుపుకొనిపోయే ప్రయత్నం చేయలేదని ఆర్కే గుర్తు చేశారు.

అంతే కాదు.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలను కూడా పట్టించుకోలేదట. సొంత పార్టీ నాయకులకు కూడా తగినంత సమయం ఇచ్చేవారు కాదట. రాజధానిగా అమరావతి విషయంలోనూ చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరించారని ఆర్కే గుర్తు చేశారు. రాజధానిగా  అమరావతి ప్రాంతం ఎంపిక దగ్గర నుంచి అక్కడ చేపట్టబోయే కార్యక్రమాలలో ప్రతిపక్షాలను భాగస్వాములను చేయలేదని ఆర్కే గుర్తు చేశారు.

ఇలాంటి అనేక కార్యక్రమాల్లో ఏకపక్షంగా పోవడం వల్ల అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత సుడిగాలిలా వ్యాపించిందట. అందుకే గత ఎన్నికల్లో చంద్రబాబు ఘోరంగా ఓడిపోయారని... మళ్లీ కోలుకుని పార్టీని నిలబెట్టుకోవడానికి చంద్రబాబుకు రెండేళ్లు పట్టిందని ఆర్కే అంటున్నారు. విచిత్రం ఏంటంటే.. అమరావతి నిర్మాణం దగ్గర నుంచి అన్ని విషయాల్లో ఆర్కే చంద్రబాబుకు సలహాలు ఇచ్చారన చెబుతుంటారు. మరి ఈ విషయాలన్నీ అప్పుడే చంద్రబాబుకు చెప్పి ఉంటే.. ఆయన పదవి పోయేది కాదు కదా.. ఏమంటారు..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: