కేసీఆర్ ఏమి ఇచ్చినా.. అంతా ఈటెల ఖాతా లోకేనా?

తెలంగాణ కేసీఆర్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశారు.. రెండోసారి సీఎం అయ్యాక దాదాపు రెండేళ్ల పాటు పెద్దగా జనంలోకి రాని ఆయన ఇప్పుడు తరచూ ప్రజల్లోకి వెళ్తున్నారు.. ఏదో ఒక కార్యక్రమం సృష్టించుకుని ప్రజల వద్దకు వెళ్తున్నారు. తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొత్త కొత్త పథకాలు మళ్లీ ప్రకటిస్తున్నారు. తాజాగా ఆయన రోజూ దళిత జపం చేస్తున్నారు. దళిత బంధు పేరుతో ఒక్కో దళిత కుటుంబం ఖాతాలో రూ. 10 లక్షల రూపాయలు వేస్తామంటున్నారు. వేస్తామని చెప్పడమే కాదు.. వాసాల మర్రి గ్రామస్తుల ఖాతాల్లో అప్పుడే రూ. 10 లక్షల రూపాయలు పడిపోయాయి కూడా.

అంతే కాదు.. ఇక 57 ఏళ్లు వచ్చిన వాళ్లకు కూడా వాళ్లకు ఫించన్లు ఇచ్చేస్తారట.. ఇప్పటి వరకూ 60 ఏళ్లుగా ఉండే ఈ వయస్సు నిబంధనను ఇప్పుడు కేసీఆర్ సడలిస్తున్నారు. కొత్తగా మళ్లీ విస్తృతంగా రేషన్ కార్డులు ఇస్తున్నారు. ఇలా ఒకటా రెండా.. ఆయన మళ్లీ సంక్షేమం బాట పట్టేశారు. అయితే ఇదంతా హుజూరాబాద్ ఎన్నికల కోసమే అనే వారు లేకపోలేదు.. అందులో వాస్తవం కూడా లేకపోలేదు.. ఈ విషయాన్ని సాక్షాత్తూ కేసీఆరే కౌశిక్‌ రెడ్డి పార్టీలో చేరిన వేళ చెప్పారు.. ఎన్నికల్లో లబ్ది కోసం బరాబర్ పథకాలు తెస్తామన్నారు.

అయితే ఇంత చేసినా ఈ క్రెడిట్ కేసీఆర్‌ కు దక్కుతుందా.. హుజూరాబాద్‌లో జనం టీఆర్ఎస్‌కు పట్టం కడతారా.. లేక కేసీఆర్‌ను ఎదిరిస్తున్నా ఈటల రాజేందర్‌ను మరోసారి ఎన్నుకుంటారా అన్న ఉత్కంఠ అంతటా నెలకొంది. ఇప్పుడప్పుడే హుజూరాబాద్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రాకపోయినా అక్కడ ఎన్నికల రంగం మాత్రం బాగా వేడెక్కింది. ఇప్పటికే పాదయాత్ర ప్రారంభించిన ఈటల రాజేందర్‌ అనారోగ్యం కారణంగా కొన్నిరోజులు యాత్రను వాయిదా వేసుకున్నారు.

కాస్త కోలుకున్న ఈటల.. కేసీఆర్ కొత్త పథకాలపై స్పందించారు. తాను బరిలో దిగబట్టే తనను ఓడించడం కోసమే కేసీఆర్ ఇన్ని పథకాలు తెస్తున్నారని ఆయన అంటున్నారు. మొత్తం మీద తనవల్లే కేసీఆర్ ఈ ఎత్తులు వేస్తున్నారు కాబట్టి.. కేసీఆర్ ఇచ్చే వాటి క్రెడిట్ అంతా తనకే దక్కుతుందంటున్నారు. కేసీఆర్‌ ఇకపై ఏం ఇచ్చినా ఆ ఘనత అంతా నాదే అంటున్నారు. మరి హుజూరాబాద్ జనం ఏం ఫీలవుతారో.. ఎవరిని గెలిపిస్తారో.. చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: