ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. సెల్ఫ్‌గోల్‌ చేసుకున్నారా..?

frame ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. సెల్ఫ్‌గోల్‌ చేసుకున్నారా..?

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకూ సీఎం జగన్‌కూ వైరం ఉన్న సంగతి తెలిసిందే. ఆంధ్రజ్యోతి పత్రిక ఆంధ్రజ్యోతి కాదని..అది చంద్రజ్యోతి అని వైసీపీ నేతలు విమర్శిస్తుంటారు. దీనికి తగ్గట్టుగానే ఆంధ్రజ్యోతి కథనాలు, విమర్శలు ఉంటుంటాయి. ఇక ఈ విమర్శల విషయం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎపిసోడ్‌ విషయంలో మరింతగా ముదిరిపోయాయి. ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని రోజూ జగన్ సర్కారును విమర్శిస్తుంటారని వైసీపీ నేతల్లో ఆగ్రహం ఉంది.


ఆ తర్వాత ఎంపీ రఘురామ కృష్ణంరాజును రాజద్రోహం కేసు కింద అరెస్టు చేయడం.. ఆయన కాళ్లకు దెబ్బలు కనిపించడం.. ఆయన కోర్టును ఆశ్రయించి బెయిల్ తెచ్చుకోవడం అంతా ఓ సస్పెన్స్ డ్రామా తరహాలో సాగిపోయాయి. అయితే.. ఎంపీ రఘురామ కృష్ణంరాజు పూర్తిగా చంద్రబాబు, ఎల్లో మీడియా చేతిలో కీలుబొమ్మగా మారి.. రాష్ట్రంలో అనేక వర్గాల మధ్య చిచ్చుపెట్టేలా ప్రవర్తిస్తున్నారని ఏపీ సీఐడీ తన తాజా నివేదికలో కోర్టుకు తెలిపింది. ఈ విషయంలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఫోన్‌లోని వాట్సప్ సంభాషణలను సాక్ష్యంగా చూపించింది.


ఎంపీ రఘురామ కృష్ణంరాజు తరచూ చంద్రబాబు, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, ఆ ఛానల్ యాంకర్ వెంకటకృష్ణతోనూ రెగ్యులర్‌ గా టచ్ ఉంటాడని.. వారి సూచనల మేరకే ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటాడని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటారు. ఇప్పుడు ఇదే అంశంపై ఏబీఎన్ రాధాకృష్ణ తన కొత్త పలుకు ఎడిటోరియల్‌లో రాస్తూ సెల్ఫ్‌గోల్‌ చేసుకున్నారు. ఏబీఎన్‌ చానెల్‌పై నమోదు చేసిన రాజద్రోహం కేసు గురించి తన ఎడిటోరియల్ ను ప్రస్తావించిన రాధాకృష్ణ.. రెబల్‌ ఎంపీ రఘురామరాజుతో కలిసి మేం ఏదో కుట్ర చేశామని ప్రచారం చేయడం అవాస్తవం అని రాస్తూనే.. ఆయనతో వాట్సప్‌ చాట్ చేసినట్టు అంగీకరించారు.


రాజద్రోహం కేసుపై సుప్రీంకోర్టును ఆశ్రయించామని.. తమ పిటిషన్‌కు కౌంటర్‌ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం... తమపై నమోదు చేసిన కేసుకు బలం చేకూర్చే ఒక్క ఆధారం కూడా చూపలేదని ఆర్కే అన్నారు. అయితే.. రఘురాజు నాకు ఏదో మెసేజ్‌ పంపారని ఆ కౌంటర్లో పేర్కొన్నారని... ఈ మెసేజ్‌ తనకు అందిన మాట వాస్తవమేనని..కానీ దానికి తాను జవాబు ఇవ్వలేదుగా అని సమర్థించుకున్నారు. అంతే కాదు.. ఏబీఎన్‌ ప్రతినిధి వెంకటకృష్ణకు, రఘురాజుకు మధ్య మెసేజ్‌లు పంపుకోవడం జరిగిందని.. అందులో వింతేముందని వాదించారు. దీన్ని సీఐడీ ఏదో గొప్ప విషయం కనుక్కున్నట్టుగా చెప్పుకొచ్చిందని.. అందులో అభ్యంతరకరమైనవి ఏమిటో ఏలినవారే చెప్పాలని ప్రశ్నించారు. అంటే రామకృష్ణంరాజుతో వాట్సప్ చాట్‌ను అంగీకరించినట్టేగా.. ఇది సెల్ఫ్‌ గోల్‌ కాదా..?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: