కోకాపేట వేలం: కేసీఆర్ పై ''లాండ్'' మైన్ పేల్చనున్న రేవంత్..?
కోకాపేట భూముల వేలం ద్వారా రూ.వెయ్యి కోట్ల దోపిడీ జరిగిందంటున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి... దాన్ని ఇవాళ బయటపెడతానంటున్నారు. ఈ భూ బాగోతం వెనక మొత్తం టీఆర్ఎస్ నేతలే ఉన్నారని చెబుతున్నారు. కేవలం గంట సేపట్లోనే వారు వెయ్యి కోట్లు జుర్రుకున్నారని.. ఆ వివరాలన్నీ ఆధారాలతో సహా రేపు బయటపెడతానని రేవంత్ అంటున్నారు. వాస్తవానికి ఎకరా రూ.60 కోట్లు పలకాల్సిన భూమి కేవలం రూ.30 కోట్లకే దోచేశారని రేవంత్ ఆరోపించారు.
ఈ వేలంలో టెండర్లు వేయకుండా కొంత మందిని మేనేజ్ చేశారని.. కేసీఆర్ తన బినామీలు, పార్టీ వారి కోసమే మేనేజ్ చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ జోక్యం కారణంగానే రూ.3వేల కోట్ల ఆదాయం రావాల్సిన చోట రూ.2వేల కోట్లే వచ్చాయని రేవంత్ ఆరోపించారు. ఈ వేలంలో పాల్గొన్న కంపెనీల జాతకాలనూ... వారికీ ముఖ్యమంత్రి కేసీఆర్ లావాదేవీలనూ ఇవాళ బయటపెడతానని రేవంత్ చెప్పారు. ఇప్పుడు రేవంత్ ఈ భూముల వేలంపై ఏం చెబుతారో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
రేవంత్ ఆరోపణలు చేశారని కాకపోయినా.. కోకాపేట భూములు కాస్త తక్కువ ధరకే వెళ్లినట్టు చెప్పుకోవాలి. పక్కపక్కనే ఉన్న భూములకు కోట్ల రూపాయల తేడాతో వేలం జరగడం కూడా రేవంత్ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. మరి రేవంత్ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి. ఈ వేలంలో ఏం జరిగింది. ఒకవేళ స్కామ్ జరిగినా దాన్ని రేవంత్ రెడ్డి ఎలా నిరూపించగలుగుతారు అన్నది ఇప్పుడు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. చూద్దాం రేవంత్ ఎలా నిరూపిస్తారో..?