జగన్ మళ్లీ సెల్ఫ్‌గోల్‌.. ఎందుకు కెలుక్కున్నట్టో..?

రాజకీయాలన్నాక వివాదాలు తప్పదు.. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని వ్యతిరేకించేవాళ్లూ.. సమర్థించేవాళ్లూ ఉంటారు. అయితే కొన్ని వివాదాలు అనవసరంగా కొని తెచ్చుకున్నవి ఉంటాయి. జగన్ ఇలాంటి సెల్ఫ్‌గోల్స్‌ అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు తెలుగు అకాడమీ వివాదం కూడా అలాంటిదే అని చెప్పుకోవచ్చు. తెలుగు అకాడమి పేరులో మార్పు చేస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదం అయ్యింది.


విషయం ఏంటంటే.. తెలుగు అకాడమీని.. తెలుగు-సంస్కృత అకాడమీగా పేరు మారుస్తూ జగన్  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా ఎందుకు చేశారో.. దీనివల్ల ఒనగూరేదేమిటో ఒక పట్టాన అంతుపట్టదు. ఇప్పటికిప్పుడు సంస్కృతాన్ని ఉద్ధరించాలన్న డిమాండ్‌ ఏమీ లేదు. మరి జగన్ సర్కారు ఎందుకు తెలుగు అకాడమీని.. తెలుగు-సంస్కృత అకాడమీగా పేరు మార్చిందో తెలియదు. కానీ.. ఈ పేరుతో ప్రభుత్వాన్ని కడిగేయడానికి తానే ఆస్కారం ఇచ్చినట్టయింది.


ఊహించినట్టుగానే ఈ అంశంపై వివిధ రాజకీయ పార్టీలు స్పందించాయి. తెలుగు భాషాభిమానుల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన జరగాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. ఇప్పుడు మరోసారి అలాంటి అవకాశం చేతులారా ఇచ్చినట్టయింది. ఈ అంశంపై జగసేన అధినేత పవన్ స్పందించారు. తెలుగు అకాడమి పేరు మారుస్తూ ఇచ్చిన ఉత్తర్వులు తెలుగు భాషాభిమానులను నిరుత్సాహపరిచేలా ఉన్నాయన్నారు.


తెలుగు భాష అభివృద్ధి, వినియోగం కోసం కృషి చేయాల్సిన అకాడమి అస్తిత్వాన్ని దూరం చేసేలా పేరు మార్చారని పవన్ అంటున్నారు. తెలుగు- సంస్కృత అకాడమి అని ఎందుకింత హడావుడిగా పేరు మార్చాల్సి వచ్చిందో ప్రజలకు వివరణ ఇవ్వాలని పవన్ అడిగారు. కేవలం పేరు మార్చడం ద్వారా సాధించే ప్రయోజనం ఏమిటని పవన్ ప్రశ్నించారు. దిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న సంస్కృత అకాడమి లాంటిది ఇక్కడ కూడా ప్రారంభించవచ్చని పవన్ సూచించారు. జగన్‌ ఇప్పటికే తెలుగు మీడియానికి మంగళం పాడిన జగన్.. తెలుగును అంతం చేయడానికే పుట్టినట్టు వ్యవహరించడం విచారకరమని మండలి బుద్ధప్రసాద్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: