ఏపీ గవర్నర్ గారు.. దేనికీ స్పందించరా..?

గవర్నర్... ఈ పదవి ఓ రబ్బర్ స్టాంప్‌లాంటిదన్న నానుడి మొదటి నుంచి ఉంది. అసలు ఈ గవర్నర్ పదవే బ్రిటీష్ భావజాలం నుంచి పుట్టిందని.. బ్రిటీష్ వాళ్లుపోయినా ఆ వాసనలు పోలేదనేందుకు ఈ పదవి ఓ ఉదాహరణ అంటుంటారు. వాస్తవానికి రాష్ట్రంలో పరిపాలన అంతా గవర్నర్ పేరు మీద జరుగుతుంది. రాష్ట్రాధిపతి రాజ్యాంగం ప్రకారం ఆయనే. కానీ.. ఆయన సొంతంగా ఏ నిర్ణయమూ తీసుకోకూడదు. మంత్రి మండలి సలహా మేరకే గవర్నర్ విధులు నిర్వహించాలి.
అంటే నిజమైన అధికారం అంతా ముఖ్యమంత్రి చేతిలోనే కేంద్రీకృతం అయ్యి ఉంటుంది. అలాగని గవర్నర్ మరీ ఉత్సవ విగ్రహం ఏమీ కాదు.. గవర్నర్ విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్. అలాగే గవర్నర్‌కు గిరిజనుల విషయంలో విశేష అధికారాలు ఉంటాయి. అలాగే అవసరమైనప్పుడు పాలనలో జోక్యం చేసుకునే అధికారమూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఏపీకి గవర్నర్‌గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ మాత్రం గవర్నర్ రబ్బర్‌స్టాంప్ అనేందుకు అచ్చమైన ఉదాహరణగా నిలుస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
గవర్నర్ బిశ్వభూషణ్‌ అసలే వయస్సు మీరిన వారు.. ‌అందుకేనేమో ఎప్పుడూ ఆ రాజ్‌భవన్ దాటి అడుగు బయటపెట్టరు. అలాగే.. తన అవసరం కోసం ఎవరైనా రాజ్‌భవన్ గడప తొక్కినా సీఎంకు వ్యతిరేకంగా ఒక్క నిర్ణయమూ తీసుకోరు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విపక్షాలు గగ్గోలు పెట్టినా.. ప్రభుత్వంపై ఆరోపణలు చేసినా కనీసం వివరణ అడగలేదు. తిరుపతి ఉప ఎన్నికల్లో అన్ని ఆరోపణలు వచ్చినా.. కనీసం ఏం జరిగిందన్న విషయం కూడా తెలుసుకోలేదు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి దారుణంగా ఉన్నా సరే కనీసం సమీక్ష చేయరు.
ఇక తాజాగా రఘురామ వ్యవహారంలో కోర్ట్ ధిక్కరణ  జరిగిందని.. ఓ ఎంపీపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసించారని లెటర్ రాసినా.. సైలెంట్ గానే ఉన్నారు. ఆ పక్కన ఉన్న తెలంగాణలో గవర్నర్ కాస్త నయం.. అప్పుడప్పుడు రాష్ట్ర పరిస్థితుల గురించి సీఎంను, అధికారులను అడుగుతూ సూచనలు చేస్తుంటారు. కానీ ఏపీ గవర్నర్ మాత్రం పూర్తిగా సైలెంట్. మొత్తానికి నేను దేనికీ స్పందించను అన్నట్టుగా కాలం గడుపుకుంటూ పోతున్నారు బిశ్వభూషణ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: