రఘురామ కేసులో ఆ ఐపీఎస్‌ అడ్డంగా బుక్కయ్యారా..?

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్టు వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. రఘురామ కృష్ణంరాజు రాజద్రోహానికి పాల్పడ్డారని.. ఆయన కొన్ని వర్గాలను రెచ్చగొడుతున్నారన్న అభియోగాలపై ఏపీ సీఐడీ పోలీసులు సుమోటోగా కేసు బుక్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన్ను పుట్టినరోజే అరెస్టు చేయడం.. ఆ తర్వాత ఆయన కస్టడీలో ఉన్నప్పుడు కాలికి గాయాలు కావడం.. దానిపై రఘురామ కృష్ణంరాజు జిల్లా కోర్టుకు, హైకోర్టుకు.. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే.
రఘురామ కృష్ణంరాజు కాలి గాయాలకు సికింద్రాబాద్ మిలిట్రీ ఆస్పత్రిలో పరీక్షలు జరిపి.. నివేదిక సుప్రీంకోర్టుకు అందించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో ప్రస్తుతం రఘురామ కృష్ణంరాజు ఢిల్లీలో ఉంటున్నారు. అయితే సీఐడీ తనను అరెస్టు చేసినప్పుడు తనపై థర్డ్ డిగ్రీ ఉపయోగించారని రఘురామ కృష్ణంరాజు చెబుతున్నారు. ఏకంగా సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ తనను విపరీతంగా కొట్టారని చెబుతున్నారు. అంతే కాదు.. ఓ వ్యక్తి తన గుండెలపై కూర్చుని తన మొబైల్ లాక్ ఓపెన్ చేయించారని... ఆ తర్వాత ఆ ఫోన్ నుంచి డాటా కాపీ చేసుకున్నారని చెబుతున్నారు.
అంతే కాదు.. తన మొబైల్‌ తీసుకున్నట్టు ఎక్కడా రికార్డుల్లో చూపలేదని.. ఆ మొబైల్‌ నుంచి మరికొందరికి మాజీ ఏఎస్‌ఎస్‌ పీవీ రమేష్‌తో సహా పలువురికి సందేశాలు పంపారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సునీల్‌ కుమార్‌కు లీగల్ నోటీసు పంపారు. దీనిపై విచారణ జరిపించాలని ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు రఘురామ కృష్ణంరాజు. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం చూస్తే సీఐడీ డీజీ సునీల్‌ కుమార్‌ పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుపోతున్నారేమో అనిపించకమానదు.
కస్టడీలో ఉన్న వ్యక్తిపై థర్డ్ డిగ్రీ ప్రయోగం.. అందులోనూ ఓ ఎంపీపై థర్డ్ డిగ్రీ ప్రయోగం చాలా సీరియస్ ఇష్యూ. అయితే దాన్ని నిరూపించడం కష్టం. కానీ.. మొబైల్‌ నుంచి వాట్సప్ మెస్సేజులు పంపడం.. దాన్ని రికార్డుల్లో చూపకపోవడం వంటివి ఈ టెక్నాలజీ యుగంలో నిరూపించడం సులభమే.  ఒకవేళ రఘురామ చెప్పింది నిజమే అయితే.. పీపీ సునీల్‌ కుమార్ అడ్డంగా బుక్ అయినట్టే. చూడాలి ఏం జరుగుతుందో.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: