బెంగాల్ తీర్పు: గెలిచి ఓడిన మమత.. ఓడి గెలిచిన మోడీ..!?
మోడీ, అమిత్ షా మంత్ర తంత్రాలను ఒక్కచేత్తో తిప్పికొట్టిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.. ముచ్చటగా మూడోసారి తన పార్టీని బెంగాల్ లో గెలిపించుకుంది. 294 అసెంబ్లీ సీట్లున్న బెంగాల్‌లో ఏకంగా 200 పైచిలుకు స్థానాలు టీఎంసీ గెలుచుకుంది. వరుసగా మూడో సారి ఈ స్థాయిలో గెలవడం అంటే సంచలనమే. అయితే ఇంతా చేసిన మమత తాను స్వయంగా బరిలో దిగిన నందిగ్రామ్‌లో మాత్రం ఓడిపోయింది. 1200 స్వల్ప ఓట్ల తేడాతో తన మాజీ మంత్రి సువేందు అధికారి చేతిలో ఓడిపోయింది.
అలా మమత రాష్ట్రం మొత్తం గెలిచి.. తాను మాత్రం ఓడింది. గెలిచి ఓడింది. ఇక మోడీ విషయానికి వస్తే.. మోడీ బెంగాల్ ఎన్నికల కోసం వేయని ఎత్తులు, జిత్తులు లేవు. చివరకు బెంగాల్ ఎన్నికల కోసమే మోడీ గడ్డం పెంచారన్న టాక్ కూడా వచ్చింది. ఏకంగా 8 విడతల్లో పోలింగ్ పెట్టించడం కూడా గెలుపు కోసం అడ్డదారులు తొక్కేందుకే అన్న విశ్లేషణలూ వచ్చాయి. మోడీ బెంగాల్‌లో గెలుపు కోసం దేశాన్నే పణంగా పెట్టారన్న విమర్శలూ వచ్చాయి.
అయితే ఇంత చేసినా మోడీ, అమిత్ షా ఎత్తులు పారలేదు. బీజేపీ రెండంకెల స్కోరు దాటనే లేదు. ఇది చూస్తే మోడీకి అపజయంగా కనిపించవచ్చు. కానీ.. బెంగాల్‌లో బీజేపీ గతంలో ఎన్నడూ లేనంతగా తన బలం పెంచుకుంది. గతంలో ఆ పార్టీకి కేవలం 3 సీట్లు మాత్రమే వచ్చాయి. అలాంటిది ఇప్పుడు 80 వరకూ సీట్లు వస్తున్నాయి. అంటే ఇది ఎంత పెరుగుదలో అంచనా వేయొచ్చు. ఆ విధంగా మోడీ ఓడి గెలిచాడనే చెప్పాలి.