విశాఖలో భూదందాలు.. మరీ ఈ రేంజ్‌లోనా?

విశాఖ భూముల అక్రమాలు జోరుగా సాగుతున్నాయని కొన్నిరోజులుగా మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దసపల్లా భూముల వ్యవహారం, ఎంపీ ఎంవీవీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు వ్యవహారం వంటివి చర్చనీయాంశం అయ్యాయి. ఈ విషయాల్లో వైసీపీ ఎంపీలే ఒకరి లొసుగులు మరొకరు బయటపెట్టుకున్న ఉదంతాలు కూడా విషయాన్ని మరింతగా హైలెట్ చేశాయి. అయితే.. తాజాగా ఈ  వ్యవహారంలో సిబిఐతో విచారణ చేయించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్‌ చేస్తున్నారు.

విశాఖలోని భూ అక్రమాలపై  సోము వీర్రాజు ముఖ్యమంత్రి జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. విశాఖపట్నం, పరిసర ప్రాంతాలు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు, దేవాదాయ శాఖకు చెందిన భూములతో పాటు స్వాతంత్ర్య సమరయోధులు, వారి కుటుంబాలకు, మాజీ సైనిక ఉద్యోగులకు కేటాయించిన భూములు, సామాన్య మధ్యతరగతికి చెందిన వారి భూములే కాదు, ఎక్కడ ఖాళీగా కనబడితే అక్కడ  గత రెండు దశాబ్దలుగా అక్రమార్కులు గద్దల్లా వాలి ఆక్రమించుకుంటున్నారని సోము వీర్రాజు అంటున్నారు.

విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో దురాక్రమణకు గురైన భూములను కబ్జా రాయుళ్లు నుంచి తిరిగి స్వాధీనం చేసుకుని వాటి నిజమైన యాజమాన్యాలకు అప్పగించాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగిందని సోము వీర్రాజు ఆరోపించారు. దర్యాప్తు చేయాల్సిన అంశాలపై ప్రభుత్వం  దోబూచలాడుతూ ద్వంద్వ వైఖరి అవలంభించడాన్ని సోము వీర్రాజు తప్పుపట్టారు. రెండు దశాబ్దాలుగా విశాఖపట్నం పరిధిలో, వెనకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో  ప్రభుత్వ భూముల కబ్జాలు, ప్రైవేటు, వివాదాస్పద భూముల దురాక్రమణలు జరిగాయని సోము వీర్రాజు అన్నారు.

ప్రభుత్వ భూములను ఆక్రమించి, వాటిని తెగనమ్ముకోవటానికి ఎన్ఓసీలు పొందటం, మాజీ సైనికులకు,  స్వాతంత్ర్య సమరయోధులకు కేటాయించిన ప్రభుత్వ భూములను నయానో  భయానో బెదిరించి స్వాధీనం చేసుకుని వాటికి అనేక వక్ర మార్గాల్లో ఎన్వోసీలు పొందారని సోము వీర్రాజు అన్నారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం  వేల కోట్ల విలువైన అక్రమలావాదేవీల మీద, భూములు అన్యాక్రాంతం కావటం మీదా సిబిఐ విచారణ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: