ఇవాళ శ్రీకాకుళం జిల్లాకు సీఎం.. ఏం చేస్తారంటే?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటిస్తారు. అక్కడ వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరతారు. ఉదయం 11 గంటలకు నరసన్నపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానానికి చేరుకుంటారు. 11 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

రీసర్వే చేసిన లబ్ధిదారులకు సీఎం జగన్ పత్రాల పంపిణీ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం 2020 డిసెంబర్‌ 21న ‘‘వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకాన్ని’’ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 47,276 చ.కి.మీ పరిధిలోని 6,819 గ్రామాల్లో డ్రోన్‌ ఫ్లయింగ్‌ పూర్తయిందని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటి వరకూ 2000 గ్రామాల్లో రీసర్వే కార్యకలాపాలు పూర్తయ్యాయని తెలుస్తోంది.

ఇప్పటి వరకూ 1835 గ్రామాల్లో 7,29,381 మంది రైతులకు భూ హక్కు పత్రాలు రూపొందించారు., 2వేల గ్రామాల రైతులకు జగనన్న భూ హక్కు పత్రాల పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. రాబోయే 15 రోజులలో ఈ 2వేల గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం ఈ మధ్యాహ్నం 1.25 గంటలకు సీఎం జగన్  బయలుదేరి 3.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

అయితే.. సీఎం పర్యటన కోసం అధికారులు చేస్తున్న ఏర్పాట్లు వివాదస్పదం అవుతున్నాయి. సీఎం రాక సందర్భంగా నరసన్నపేటలో నిన్నటి నుంచే హడావిడి మొదలైంది. సీఎం ప్రయాణించే మార్గానికి ఇరువైపులా బ్యారికేడ్లు నిర్మించారు. షాపుల వారిని ఒక రోజు ముందుగానే మూయించారు. ఇలాంటి చర్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో సీఎం జగన్ ఎక్కడ పర్యటించినా ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లు వివాదాస్పదం అవుతున్నాయి. సీఎం జగన్‌కు ప్రజలంటే అంత భయం ఎందుకని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: