డేటా చౌర్యం.. అసలు నివేదిక ఏం తేల్చిందంటే?

డేటా చౌర్యం వ్యవహారం మరోసారి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. దీనిపై తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని సభా సంఘం అసెంబ్లీకి మధ్యంతర నివేదికను సమర్పించింది. మొత్తం 85 పేజీలతో కూడిన మధ్యంతర నివేదికను శాసనసభకు అందించింది. ఈ వ్యవహారంపై వివరాలను అందించాల్సిందిగా గూగుల్ సంస్థకు భూమన నేతృత్వంలోని హౌస్ కమిటీ లేఖ రాసింది.  స్టేట్ డేటా సెంటర్ సర్వర్ల నుంచి గుర్తు తెలీని సర్వర్ ఐపీలకు వెళ్లిన వివరాలను ఇవ్వాల్సిందిగా గూగుల్ ను కోరింది.

సభా సంఘం పంపిన ఐపీ అడ్రస్ ల వివరాలను గుర్తించలేమని గూగుల్ తేల్చి చెప్పింది. సదరు ఐపీ అడ్రస్ లు గూగుల్ కు చెందినవే అయినా ప్రత్యేకంగా ఎవరికీ కేటాయించనందున గుర్తింపు కష్టమని గూగుల్ పేర్కోంది. తదుపరి సంప్రదింపుల కోసం తమ న్యాయవిభాగానికి ఈమెయిల్ పంపాలని గూగుల్ సూచించింది. ఏపీ కంప్యూటర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ పర్యవేక్షణలో రాష్ట్రంలోని కంప్యూటర్ నెట్ వర్క్ , డేటా భద్రత, సర్వర్ల వివరాలను  ఇంటెలిజెన్స్ విభాగం విశ్లేషించినట్టు  హౌస్ కమిటీ తన నివేదికలో పేర్కోంది.

డేటా మార్పిడికి సంబంధించిన లావాదేవీలు లాగ్స్ రూపంలో జరిగినట్టుగా మధ్యంతర నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలోని 18 స్టేడ్ డేటా సెంటర్ల నుంచి పెద్ద మొత్తంలో డేటా మార్పిడి జరిగినట్టుగా హౌస్ కమిటీ  తేల్చింది.  2018 నవంబర్ 30 నుంచి 2019 మార్చి 31 తేదీ వరకూ ఈ డేటా మార్పిడికి సంబంధించి అధికారిక అనుమతుల్లేవని మధ్యంతర నివేదిక స్పష్టం చేసింది.  రాష్ట్ర డేటా సెంటర్ సర్వర్ల నుంచి బయట సర్వర్ లకు మార్పిడి జరిగిన ఈ డేటా వివరాలు, ఐపీ  అడ్రస్ లను కూడా గూగుల్ గుర్తించలేకపోయిందని సభా సంఘం మధ్యంతర నివేదికలో స్పష్టం చేసింది.

రాష్ట్రంలోని పౌరులకు సంబంధించిన సున్నితమైన సమాచారం 2018 నవంబర్ 30 నుంచి 2019 మార్చి 31 తేదీ మధ్య ఎస్డీసీ నుంచి గుర్తు తెలీని సర్వర్లకు మార్పిడి జరిగినట్టుగా కమిటీ తేల్చింది. ఈమేరకు సమాచార మార్పిడి జరిగినట్టుగా భావిస్తున్న  వేర్వేరు సర్వర్లలోని ఐపీ ఆడ్రస్ ల జాబితాను మధ్యంతర నివేదికలో పొందు పరిచారు. స్టేట్ డేటా సెంటర్ లో గోప్యంగా ఉండాల్సిన సమాచారాన్ని సేవా మిత్ర యాప్ కు అప్పగించారని సభాసంఘం ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.  చాలా అంశాలు విచారణ చేసిన తరవాత టిడిపి ఈ చౌర్యానికి పాల్పడినట్టు గుర్తించామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: