జగన్‌ను ఇరుకున పెడుతున్నసీనియర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్?

ఆయన ఓ సీనియర్ ఐపీఎస్‌ ఆఫీసర్.. టీడీపీ అనుకూలం అన్న ముద్ర ఉంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన చెలరేగిపోయారు. రాష్ట్ర ఇంటలెజిన్స్ చీఫ్‌గా విశ్వరూపం చూపించారు. ఇప్పుడు దాని ఫలితంగానే సీఎం జగన్ ఆగ్రహానికి గురయ్యారు. సీఎం జగన్ అధికారంలోకి రాగానే ఆయన్ను లూప్ లైన్‌లో వేసేశారు. దీనికితోడు ఆయనపై కొన్ని కేసులు పెట్టారు. ఆ కేసుల కారణంగా ఆయన్ను సస్పెండ్ చేశారు.

ఆయన మాత్రం జగన్ సర్కారుపై న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆయనే ఏబీ వెంకటేశ్వరరావు. ఇటీవల ఆయన సస్పెన్షన్‌ ఎత్తేసి పోస్టింగ్ ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇప్పుడు ఆ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తనకు పోస్టింగ్ ఇవ్వాలంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వానికి లేఖ అందించారు. ఈ మేరకు సచివాలయంలో సీఎస్ సమీర్ శర్మను కలిసిన ఏబీ వెంకటేశ్వర రావు ఆయనకు లేఖ అందించారు. తనపై ఉన్న  సస్పెన్షన్ ఎత్తివేయాలన్న  సుప్రీం కోర్టు ఆదేశాలను ఏబీవీ తన లేఖలో పేర్కొన్నారు.

తన సస్పెన్షన్ ప్రారంభం నుంచి సుప్రీం ఆదేశాల వరకు జరిగిన పరిణామాలను  ఏబీ వెంకటేశ్వర రావు తన లేఖలో వివరించారు. సుప్రీం తీర్పు మేరకే ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తున్నట్టు ఏబీ వెంకటేశ్వరరావు చెబుతున్నారు. పోస్టింగ్ విషయంలో ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నానని  ఏబీ వెంకటేశ్వర రావు చెబుతున్నారు.

ఏ పోస్టింగుకు తాను అర్హుడినని ప్రభుత్వం భావిస్తుందో.. ఆ పోస్టింగ్ ఇవ్వాలని కోరుతూ సీఎస్ కు  ఏబీ వెంకటేశ్వర రావు తాజాగా లేఖ అందించారు. అంతే కాదు.. పెండింగ్ లో ఉన్న తన జీత భత్యాల చెల్లింపుల విషయంలోనూ  తగిన చర్యలు తీసుకోవాలని  ఏబీ వెంకటేశ్వర రావు  తన లేఖలో కోరారు. మరి ఇప్పుడు జగన్ సర్కారు ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఆయనకు పోస్టింగ్ ఇవ్వడం జగన్ కు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ.. సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చాక.. ఎక్కువ కాలం ఆప కూడదు కదా.. మరి  ఏబీ వెంకటేశ్వర రావు కు పోస్టింగ్‌ ఇవ్వకుండా ఆలస్యం చేసేందుకు ఏ ప్లాన్ వేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: